దేశంలో రోడ్డు, రైలు, విమానాశ్రయాలు, పోర్టులకు కనెక్టివిటి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా సుదూరంగా వుండే ఎయిర్‌పోర్టులను త్వరితగతిన చేరుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పారు పంజాబ్ రవాణా శాఖ మంత్రి లాల్జీత్ సింగ్.రాష్ట్రంలోని పలు నగరాల నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు త్వరలోనే బస్సు సర్వీసులను పున: ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రుల మధ్య చర్చల అనంతరం బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల రవాణా శాఖల కార్యదర్శి స్థాయి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు లాల్జీత్ సింగ్ తెలిపారు.సీఎం భగవంత్ మాన్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో రవాణా శాఖ ఆదాయ మార్గాలపై చర్చించినట్లు చెప్పారు.
ఇదే భేటీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న సమస్య గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు లాల్జీత్ తెలిపారు.
ఇందిరా గాంధీ విమానాశ్రయం వరకు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించినట్లు రవాణా మంత్రి చెప్పారు.
ఇదే విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి భగవంత్ మాన్ తెలియజేసినట్లు లాల్జీత్ సింగ్ పేర్కొన్నారు.అనంతరం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించాల్సిందిగా రవాణా శాఖ కార్యదర్శి వికాస్ గార్గ్‌ను కోరినట్లు లాల్జీత్ సింగ్ తెలిపారు.

కాగా.ఇటీవల లండన్- చండీగఢ్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించాలని చండీగఢ్‌లోని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ కరోలిన్ రోవెట్‌ను కోరారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులతో పాటు యూకేలో స్థిరపడిన పంజాబీ ప్రవాసులకు సౌకర్యాలు కల్పించడానికి బ్రిటీష్ కమీషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని కరోలిన్ హామీ ఇచ్చారు.
తక్షణం డైరెక్ట్ ఎయిర్ లింక్ ఆవశ్యకతను నొక్కి చెప్పిన భగవంత్ మాన్.
చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం .పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ ప్రజలకు సేవలు అందిస్తోందని చెప్పారు.ఈ ఎయిర్‌పోర్ట్‌లో బోయింగ్ 777 వంటి భారీ విమానాలను ల్యాండ్ చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు వున్నట్లు కరోలిన్ దృష్టికి తీసుకెళ్లారు.CAT-IIIB ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్‌తో పాటు అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ వివరించారు.







