ప్రస్తుత ఆధునిక యుగం అంతా పోటీ ప్రపంచంగా మారిపోయింది.వ్యాపార దృక్పథంతో ఎవరికి వారు పైకి ఎదగాలని ఆశిస్తుంటారు.
ఇందుకు కార్పొరేట్ సంస్థలు కూడా మినహాయింపు కాదు.మార్కెట్‌లో ఎదగాలని ప్రతి కంపెనీ కోరుకోవడం సహజం.
ఈ క్రమంలో ఇతర సంస్థలు తమను డామినేట్ చేస్తున్నాయని భావిస్తే అందుకు ప్రతిగా చర్యలు తీసుకుంటున్నాయి.ఇదే కోవలో ఇన్‌స్టాగ్రామ్ కూడా పయనిస్తోంది.
రీల్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే వాటిపై ఓ కన్నేసి ఉంచనుంది.
గతేడాది వరకు సరదా సరదా వీడియోలు చేయడానికి అందరూ టిక్ టాక్ పైనే ఆసక్తి చూపించే వారు.
కోట్లాది మందికి టిక్ టాక్ చేరువైంది.ఏ మాత్రం తీరిక దొరికినా టిక్ టాక్ వీడియోలు చేసే వారు కొందరైతే, వీలు కల్పించుకుని మరీ వీడియోలో చేసే వారు మరికొందరు.
అంతలా అందరినీ టిక్ టాక్ ఆకర్షించింది.దీనికి చైనా నేపథ్యం ఉండడం మైనస్‌గా మారింది.
భారతీయుల వివరాలను ఈ యాప్ చైనాకు చేరవేస్తుందనే అనుమానంతో భారత ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది.పలు దేశాలు కూడా అదే బాటలో నడిచాయి.
కోట్ల మంది యూజర్లుండే భారత్‌లో దీనిపై నిషేధం విధించడం, అమెరికా కూడా ఆంక్షలు పెట్టడంతో దాదాపు ఈ సంస్థ మూత పడింది.
ప్రస్తుతం అంతా ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడిపోయారు.
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చకచకా రీల్స్ చేసేస్తున్నారు.కచ్చా బాదమ్ వంటి సాంగ్స్ రీల్స్‌లో ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
కొందరు ఒరిజినల్ కంటెంట్‌తో కూడిన ఇన్‌స్టా రీల్స్‌ను పోస్ట్ చేస్తుండగా, మరికొందరు షార్ట్ కట్ వెతుక్కుంటున్నారు.టిక్‌టాక్‌లో గతంలో చేసిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు.
దీని వల్ల తమ యాప్‌లో ఇతర యాప్‌కు చెందిన వీడియోలు ఉండడం ఇన్‌స్టా యాజమాన్యం గమనించింది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమ ప్లాట్‌ఫామ్‌లో ఒరిజినల్ కంటెంట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే కొత్త మార్పులను అమలు చేయనున్నారు.వాటర్ మార్క్ ఉన్న వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయకుండా సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయనున్నారు.
ఇందుకోసం స్పెషల్ అల్గారిథమ్‌ను రూపొందిస్తున్నారు.







