మధిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక శాసనసభ్యులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలోని ఇరిగేషన్, ఆర్ అండ్ బి పనుల పురోగతి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాలిముడి నుంచి కృష్ణాపురం వరకు ఉన్న లెఫ్ట్ కెనాల్ పై గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పాదయాత్ర సందర్భంగా లెఫ్ట్ కెనాల్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులు గండ్లు పడుతున్నాయని తన దృష్టికి తీసుకువచ్చారని అధికారులకు వివరించారు.
సంబంధిత కాంట్రాక్టర్ ను పిలిపించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించారని చెప్పారు.మధిర, తొర్లపాడు, చిలుకూరు లో జరుగుతున్న చెక్ డ్యాం పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సిరిపురం లో చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, బయ్యారం లో చెక్ డ్యాం నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేస్తున్నట్లు ఇరిగేషన్ డి ఈ నాగ బ్రహ్మయ్య సీఎల్పీ నేతకు వివరించారు.ఎన్ ఎస్ పి కెనాల్ ద్వారా మధిర మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు సమృద్ధి అందుతుందని వెల్లడించారు.
మధిర మండలం మడుపల్లి ఊర చెరువు, బుల్లోడి వాగు బండ్ పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎల్పీ నేత ఇరిగేషన్ అధికారులకు సూచించారు.మహాదేవపురం లో లిఫ్ట్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయినందున అధికారులపై సీరియస్ అయ్యారు.
పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గడువు తేదీ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత కాంట్రాక్టర్ అలసత్వం వల్ల పనులు అసంపూర్తిగా జరుగుతున్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ” కాంట్రాక్టర్ ఏమైనా చేస్తున్నాడా? గడువులోగా పనిచేయకుంటే బ్లాక్లిస్టులో పెట్టండని” ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.మధిర నియోజకవర్గంలో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.మడుపల్లి- బయ్యారం రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అగ్రిమెంటు కాకపోవడంతో ఇంకా పనులు మొదలు కాలేదని ఆర్అండ్ బి డి ఈ రాజశేఖర్ సమాధానం చెప్పారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఎర్రుపాలెం నుంచి గుంటుపల్లి మీదుగా గోపవరం రోడ్డు, కొత్తపాలెం నుంచి గంగినేని మీదుగా ఎర్రపాలెం వరకు రోడ్డు నిర్మాణ పనులు గురించి అడిగి తెలుసుకున్నారు.మధిర నందిగామ రోడ్డు పురోగతి ఇ ఏంటని ప్రశ్నించగా టెండర్ల పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని అధికారులు సీఎల్పీ నేత కు సమాధానం చెప్పారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ జేఈ రాజేష్, ఆర్అండ్ బి ఎ ఈ రాజేష్ లు పాల్గొన్నారు.







