వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది.ఈ అంశాన్ని రాజకీయంగానూ ఉపయోగించుకుని కేంద్ర అధికార పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టాలని టిఆర్ఎస్ ప్రయత్నించింది.
ఈ మేరకు ఢిల్లీలోనూ ధర్నా కార్యక్రమాలు భారీ స్థాయిలో టిఆర్ఎస్ చేపట్టింది.అయినా కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో ముందుకు రాలేదు.
దీంతో తర్వాత రోజు జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేశారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని కేసీఆర్ ప్రకటించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు అంశం పెద్ద తలనొప్పిగా మారింది.
కెసిఆర్ ప్రకటించినట్లుగా ఇప్పటికిప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టడం సాధ్యం కాదని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.సంచులు, రవాణా సౌకర్యం మిల్లర్లకు నూకల విషయంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం, ఈ మూడు అంశాల్లో సరైన క్లారిటీ లేదు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ కొనుగోళ్ల పై నిర్ణయం తీసుకోవడంతో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.ఈ యాసంగి సీజన్ లో దాదాపు 35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది.

దాదాపు 80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.దీనికోసం 15 కోట్ల సంచులు అవసరమని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం వద్ద 1.06 కోట్లు సంచులు మాత్రమే ఉన్నాయని, ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వలేదనే విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి పాండే సైతం చెప్పారు.పశ్చిమ బెంగాల్ నుంచి కొత్త గోనెసంచులు తెలంగాణకు వచ్చేందుకు దాదాపు మూడు వారాలకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సంచులతో కొనుగోళ్ళు మొదలైన, సంచులు వచ్చేవరకు ఇబ్బందిగానే ఉంటుందని, సంచులు అందుబాటు లోకి రాకపోతే మార్కెట్ యార్డులకు రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి గుట్టలుగా పోసే అవకాశం ఉందని, అలా చేస్తే ధాన్యం తడిసి పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా యాసంగి సీజన్ కు బాయిల్డ్ రైస్ అంటూ కేంద్రం ముందుగా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.దీనికి తగ్గట్లుగానే గతేడాది అక్టోబర్ లో రాతపూర్వకంగా దీనికి అంగీకారం తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
అయితే దీనికి రాజకీయం తోడవడంతో కేంద్రంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై పేచికి దిగింది. ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టినా చివరకు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.







