ప్రజా సంగ్రామయాత్రకు కమలదళం సిద్ధమైంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చేపడుతోన్న రెండోదశ యాత్ర అలంపూర్ నుంచి ప్రారంభంకానుంది.31 రోజుల పాటు సాగే ఈ యాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
తెలంగాణ బిజెపి రథసారథి గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉన్నాడు.ఇక కేసీఆర్ కూడా బీజేపీనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఢిల్లీ నుండి గల్లీ దాకా కేంద్రంపై పోరుకు శ్రీకారం చుట్టారు.
ఇక ఇదే సమయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టనున్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున జోగుళాంబదేవి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు.
పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ప్రారంభిస్తారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటామని బండి సంజయ్ తెలిపారు.
ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు.ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

పాదయాత్రలో ప్రతీరోజూ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలలోపు మొదలయ్యే పాదయాత్ర 11 గంటలకు ముగుస్తుంది.పాదయాత్ర సందర్భంగా మార్గమధ్యంలో వచ్చే గ్రామాలు, బస్తీల్లో ప్రజలతో బండి సంజయ్, ఇతర నేతలు సమావేశాలు, రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు.వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకొంటారు.అదేవిధంగా రాత్రి బసచేసే దగ్గర ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తారు.
50 మంది మొదలుకొని 500 మంది వరకూ ప్రజలతో సమావేశాలుంటాయి.ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలకనేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డితో పాటు శాంతకుమార్, బంగారు శ్రుతి, ఆచారి తదితర నేతలతో ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపి రూట్ మ్యాప్ ఖరారు చేసింది.







