భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం,పూసుకుంట గ్రామంలో కొండరెడ్లతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 6 ఆదివాసీ గ్రామాల పర్యటనలో భాగంగా గవర్నర్ పూసుకుంట గ్రామంలో పర్యటించి, ఇక్కడి గిరిజనుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళి సై రెండో రోజు ఆదివాసీ గ్రామం పూసుకుంటలో పర్యటించారు.ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని గవర్నర్ ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు.కొండరెడ్ల అభ్యున్నతికి కేటాయించిన 45 లక్షల చెక్కును అడిషనల్ కలెక్టర్ కి అందించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ యూనివర్సిటీ,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థల సహాయంతో గిరిజనులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.కొండ రెడ్ల అభ్యున్నతికి తనవంతు సహాయం అందిస్తానని ఆమె తెలిపారు.
గిరిజనుల జీవన విధానాన్ని మెరుగు పరచాలనే అభిలాష తనకు ఉండడం వల్ల మారుమూల గిరిజనుల కోసం తాను వచ్చానని ఆమె తెలిపారు.
దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి గ్రామాల్లోని కొండరెడ్ల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు తాను మళ్లీ ఒకసారి ఈ గ్రామాల్లో పర్యటిస్తానని గవర్నర్ అన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ సహాయంతో గిరిజన పల్లెల్లో అత్యవసర సమయాల్లో వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించేందుకు వాహన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.భవిష్యత్ లో గిరిజనుల అభ్యున్నతి కొరకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు.
ఆదివాసీల్లో ఒక్కరినైనా అభివృద్ధి పథంలో నడిపిస్తే వచ్చే సంతోషం వెలకట్టలేనిదని ఆమె అన్నారు.
పూసుకుంట గ్రామాన్ని సందర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని,అవసరమైతే మళ్లీ గ్రామానికి వచ్చి గిరిజనుల బాగోగులు తెలుసుకుంటానని ఆమె అన్నారు.
పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో గవర్నర్ స్వయంగా వంట చేయడం అక్కడి ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది.
పూసుకుంట గ్రామస్థులతో కలిసి గవర్నర్ భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.







