అగ్ర రాజ్యం అమెరికాకు భారత్ నుంచీ ఎంతో మంది వలస వెళ్తూ అక్కడే పలు రంగాలలో స్థిరపడ్డారు.ఉన్నత పదవులను అధిరోహిస్తూ, ముఖ్యంగా రాజకీయ రంగంలో సైతం అత్యంత కీలక స్థానాలలో కొలువుదీరుతున్నారు.
బిడెన్ వచ్చిన తరువాత భారతీయులకు ఏ స్థాయిలో పదవులు కట్టబెట్టారో మనకు తెలిసిందే.అయితే అమెరికాకు వలస వెళ్ళిన వారిలో భారతీయులు అత్యదికులైతే భారత్ నుంచీ అమెరికా వెళ్ళిన వారిలో అత్యధిక శాతం దక్షిణాది వాసులే ఉంటారు.
మరీ ముఖ్యంగా తెలుగు వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో తెలుగు వారి హవా కొనసాగుతూనే ఉంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారి సంఖ్య మిగిలిన రాష్ట్రాల వారితో పోల్చితే ఎక్కువగానే ఉంటుంది.టెక్సాస్ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర అత్యంత కీలకం.
అక్కడి విద్యా, వైద్య, సాంకేతిక ఇలా అనేక రంగాలలో మన వారు చూపించే ప్రతిభ అక్కడి స్థానిక ప్రభుత్వానికి తెలుగు వారిపై గౌరవం ఏర్పడేలా చేసాయి.మన తెలుగు సంస్కృతీ సాంప్రదాయలను అక్కడి ప్రజలు సైతం గౌరవించుకునేలా మన తెలుగు వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఉగాది పర్వదినం రోజున తమ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలుగు వారి సేవలను గుర్తిస్తూ, గౌరవిస్తూ మనం ఎంతో సాంప్రదాయంగా, తెలుగు వారికి అత్యంత కీలకమైన పండుగ అయిన ఉగాది రోజును తెలుగు బాష వారసత్వ దినంగా టెక్సాస్ గవర్నర్ ప్రకటించారు.

ఇకపై ప్రతీ ఏటా ఏప్రియల్ 2 వ తేదీను తెలుగు బాషా వారసత్వ దినంగా జరుపుకోవచ్చునని ఇందుకు అధికారికంగా ఆమోద ముద్ర టెక్సాస్ గవర్నర్ వేసారని అక్కడి తెలుగు ప్రవాస సంఘాలు నాయకులు, అలాగే ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ తెలిపారు.ఈ క్రమంలో తెలుగు బాషపై, తెలుగు వారిపై గవర్నర్ అబ్బాట్ కి ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని, గవర్నర్ అబ్బాట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.







