1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.
ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల వరకు దారి తీశాయి.
తదనంతర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయడంతో పంజాబ్‌లో శాంతి నెలకొంది.అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన సిక్కుల్లో వున్న కొందరు ఖలిస్తానీ అనుకూల వాదులు నేటికీ ‘‘ఖలిస్తాన్’’ కోసం పోరాడుతూనే వున్నారు.
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ అనుకూల ప్రచారం చేస్తోన్న ‘‘కే టీవీ’’ (ఖల్సా టీవీ) లైసెన్స్‌ను యూకే మీడియా వాచ్ డాగ్ రద్దు చేసింది.ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఆఫ్‌కామ్) గతేడాది డిసెంబర్ 30న కేటీవీలో ప్రసారమైన ‘ప్రైమ్ టైమ్’ ప్రోగ్రామ్‌కి సంబంధించి సస్పెన్షన్ నోటీసు ఇచ్చింది.
దీనిపై దర్యాప్తు జరిపిన ఆఫ్‌కామ్.బ్రాడ్‌కాస్టింగ్ కోడ్‌ను కేటీవీ ఉల్లంఘించిందని, నేరాన్ని ప్రేరేపించేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఖల్సా టీవీ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.95 నిమిషాల పాటు సాగిన సదరు చర్చా కార్యక్రమం హింసను ప్రేరేపించే మెటీరియల్‌ను కలిగి వుందని ఆఫ్‌కామ్ వెల్లడించింది.ఈ కారణాల చేత యూకేలో ఖల్సా టెలివిజన్ లిమిటెడ్ ప్రసారాల లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కేటీవీ అనేది ఖల్సా టెలివిజన్ లిమిటెడ్‌కి చెందిన లైసెన్స్‌తో యూకేలోని సిక్కు సమాజం కోసం ఏర్పాటైన ఛానెల్.ఆఫ్ కామ్ గతంలో కూడా ఈ ఛానెల్‌పై చర్య తీసుకుంది.గతేడాది ఫిబ్రవరిలో ఒక మ్యూజిక్ వీడియో, చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు కేటీవీపై 50,000 పౌండ్ల జరిమానా విధించింది.ఆ సమయంలో హింసకు పాల్పడాల్సిందిగా సదరు ఛానెల్ బ్రిటీష్ సిక్కులకు పరోక్ష పిలుపునిచ్చింది.







