కేంద్ర అధికార పార్టీ బీజేపీని రకరకాల మార్గాల్లో ఇబ్బంది పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం కూటమిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు.అలాగే అనేక ప్రజా సమస్యల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, బిజెపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తుండటం, ఢిల్లీ స్థాయిలో ధర్నాలు , ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండడం వీటన్నిటిని బిజెపి అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.
టిఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టకపోతే, రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక అంచనాకు వచ్చారు.దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.టిఆర్ఎస్, కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు , టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు అమిత్ షా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ మేరకు ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణలో పర్యటించేందుకు అమిత్ షా సిద్ధమౌతున్నారు.అంతకుముందే శ్రీరామనవమిని రాష్ట్రంలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారట.శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణం లోనూ అమిత్ షా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆ తరువాత పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా అమిత్ షా సందర్శించనున్నారు.
అంతేకాకుండా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించనున్న రెండో విడత పాదయాత్ర లో పాల్గొనేందుకు అమిత్ షా మరోసారి తెలంగాణకు రాబోతున్నారట.మొత్తంగా తెలంగాణ లో రాజకీయాన్ని మరింత వేడి ఎక్కించాలని అమిత్ షా డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు.