నాడు రక్తం పారిన నేలలో నేడు భగీరథుని పరుగులు పెట్టించి బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చి సస్యశ్యామలం చేశానని సీఎల్పీ లీడర్,మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చింతకాని మండల ప్రజలకు గుర్తు చేశారు.భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని కోదుమురు, వందనం, రాఘవ పురం, లచ్చ గూడెం గ్రామాల్లో కొనసాగుతుంది.
పాదయాత్ర సందర్భమగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభ లో ఆయన ప్రజలతో మాట్లాడారు.చింతకాని మండలంలోని కోదుమూరు, వందనం రాఘవాపురం గ్రామాలకు సాగు తాగునీరు ఇస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
సాంకేతికంగా అనేక అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రూల్స్ ను సవరణ చేయించి రామలింగేశ్వర స్వామి చెరువు ఫీల్డ్ డ్రాప్ ఏర్పాటు చేశామని వివరించారు.నాగార్జున సాగర్ నీళ్లు పంట పొలాల్లోకి రావడంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది అన్నారు.
రైతుల సంతోషం చూసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం తాను పడిన శ్రమను మర్చిపోయానని తెలిపారు.నాడు త్రాగడానికి నీటి ఎద్దడిని ఎదురుకున్న గ్రామాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడటం చూసి ఆనందంగా ఉందని వివరించారు.
రాఘవపురం ప్రజల కోరిక మేరకు చెరువును మినీ ట్యాంకుబండ్ గా అభివృద్ధి చేయించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.రాఘవ పురం గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.







