దేశం కాని దేశం వెళ్లి తమ అత్యుత్తమైన ప్రతిభతో ఉద్యోగం సంపాదించి, ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ఆర్దికంగా నిలదొక్కుకున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు.అయితే కొందరు మాత్రం డబ్బుపై ఆశతో తమ స్థాయిలను మరిచి మరీ తప్పుడు మార్గాలను ఎంచుకుని చివరికి కటకటాల పాలవుతున్నారు.
తాజాగా అమెరికాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.అమెరికాలో ఉద్యోగం సాధించిన ఓ భారతీయుడు అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి వెళ్ళిన తరువాత తాను పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేశాడు.
ఫలితంగా పోలీసులు అతడిపై ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అతడి ఆస్తులు మొత్తం సీజ్ చేయనున్నారు.
వివరాలలోకి వెళ్తే.
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ అయిన ఆపిల్ లో పనిచేసిన భారతీయుడు ధీరేంద్ర ప్రసాద్.సదరు కంపెనీని మోసం చేసే క్రమంలో ఆపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్ లో కొనుగోలు దారుడిగా స్థానం సంపాదించారు.
ఆ తరువాత కంపెనీతో చర్చలు జరిపి కొన్ని ఆర్డర్లు పెట్టి సంస్థను మోసం చేసినట్టుగా కనుగొన్న కంపెనీ ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రసాద్ అనే వ్యక్తి ముడుపులు తీసుకుని తప్పుడు రిపేర్ ఆర్డర్లు పెట్టి కోట్ల విలువ చేసే వస్తువులను లూటీ చేసినట్టుగా ఆపిల్ ఆధారాలతో సహా బయటపెట్టింది.
ఈ క్రమంలోనే ధీరేంద్ర ప్రసాద్ పన్ను కూడా కట్టలేదని, పలు రకాలుగా వచ్చిన 10 మిలియన్ డాలర్ల డబ్బు మొత్తాన్ని మనీ ల్యాండరింగ్ చేశాడని కంపెనీ పేర్కొంది.ప్రసాద్ కంపెనీను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొట్టాడని అన్ని సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించిన కంపెనీ అతడిని ఉద్యోగం నుంచీ తొలగించింది.
ఈ కేసు కొనసాగుతున్న క్రమంలోనే ఈ మోసంలో పాలు పంచుకున్న విక్రేతలుగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు తమ తప్పును ఒప్పుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రసాద్ చేసిన నేరాలని కూడా బయట పెట్టడంతో ప్రసాద్ పై పలు సెక్షన్ల క్రింద సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.ఈ నెల 24 తేదీన విచారణ ఉండగా ఆపిల్ కంపెనీ వేసిన కేసుల ఆధారంగా చూస్తే అతడు భారీ స్థాయిలో కోట్ల విలువైన తన ఆస్తులను పోగొట్టుకోబోతున్నాడని తెలుస్తోంది.







