చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న చందంగా ఉంది రాజకీయ నేతల వ్యవహారం.అరిగిపోయిన సీడీనే తిప్పి.
తిప్పి వేసి సినిమా చూపించినట్టు రాజకీయాల్లోనూ చెప్పిన డైలాగులే చెప్పిచెప్పి మెదడుకు అంటుకుపోయేలా చేస్తుండడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.చివరకి వినేవారు విసుగు చెందేలా చేస్తున్నారు.
నిత్యం ఎవరో ఒకరి మీద తుపాకి ఎక్కుపెట్టి.మరెవరినో కాల్చేయాలని అనుకోవడం నిత్యకృత్యంగా మారిపోతోంది.
ఈ కోవలోకే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చాడా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.తండ్రి సీఎం కేసీఆర్ కు తగ్గట్టు తనయుడు చెప్పిందే చెప్పి వలలో వేసే పనిలో నిమగ్నమైనట్టు కనిపిస్తోంది.
ఈ విషయంలో కేసీఆర్‌ను మించి తగ్గేదేలే అన్నట్టు మాట్లాడడం చర్చకు దారితీస్తోంది.
అయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా రచ్చ నెలకొన్న విషయం విధితమే.
ఏ సందర్భం వచ్చినా తెలంగాణ రాష్ట్రంకు కేంద్రం ఎలాంటి సహకారం అందించడం లేదంటూ విరుచుకుపడడం కామన్‌గా అయిపోయింది.కేంద్రం సహకరిస్తే తెలంగాణ మరోలా వికసిస్తుందని సీఎం కేసీఆర్ పలుమార్లు ఉపోద్ఘాటించారు.
ఇదే మాట మంత్రి కేటీఆర్ నోట వెంట తరచూ వస్తోంది.మీకు దమ్ముంటే ప్రాజెక్టులు తీసుకొస్తారా ? కేంద్రం నుంచి నిధులు తెస్తారా ? అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.తాజాగా హైదరాబాద్ వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తీసుకురావాలని .అలా చేస్తే వారిని సన్మానిస్తానంటూ కేటీఆర్ చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ నేతలు పాటుపడాలంటూ హితవు పలికారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యలు వింటుంటే ఓ ప్రశ్న తలెత్తక మానదు.కేంద్రం నుంచి ఆ నిధులు తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది.ఒకవేళ సాధ్యం కాకుంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నిధులు తెచ్చే భారం అప్పగించాలి.లేదంటే సీఎం సీటు కిషన్‌రెడ్డికి అప్పజెప్పాల్సి ఉంటుంది కదా ? అనే ప్రశ్న తలెత్తకమానదు.నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అనే విషయాన్ని విస్మరించి కేంద్ర మంత్రిని బదనాం చేయడం చర్చణీయాంశమవుతోంది.మరోవైపు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకీ టీఆర్ఎస్ చేసిన సన్మానం ఏంటో అందరికి తెలిసిందే.

ఇక రూ.10వేల కోట్లు తీసుకొస్తే సన్మానం చేస్తామనడం కేవలం రాజకీయ స్వలాభానికేనని సామాన్యుడికి కూడా అర్థమవుతుంది.ఇప్పటికైనా ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మాని పాలనపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ఒత్తిడి తేవాలే గానీ, ఎనిమిదేండ్ల పాలన తరువాత కూడా గదే సీడీని తిప్పి వేస్తే ఎవరూ చూడరని గ్రహించాలి.
ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ రొటీన్ డైలాగులు వీడి కొత్తగా ఏదైనా చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.