సాధారణంగా సోషల్ మీడియా వినియోగం పెరిగాక మహిళలు, యువతులకు వేధింపులు కూడా తప్పడం లేదు.ఎవరైనా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే చాలు దారుణమైన కామెంట్లతో వేధిస్తుంటారు.
ఇంకొంత మంది ప్రేమ పేరుతో టార్చర్ చేస్తుంటారు.దీనిపై హైదరాబాద్ షీ టీమ్స్ దృష్టి సారించాయి.
సోషల్ మీడియాలో మహిళల భద్రత కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు.ఆయన నేతృత్వంలో షీ టీమ్స్ చేపట్టిన ఆన్‌లైన్ గస్తీ కారణంగా మహిళలు, యువతులు స్వేచ్చగా సోషల్ మీడియా వినియోగించుకోగలుగుతున్నారు.
సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆన్‌లైన్ గస్తీ ప్రారంభించారు.షీటీమ్స్‌కు చెందిన 11 బృందాలు సోషల్ మీడియాపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాయి.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, డేటింగ్ యాప్‌లను పర్యవేక్షిస్తున్నారు.ఇటీవల కాలంలో మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
వారి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.అలాంటి వారికి చుక్కలు చూపిస్తున్నారు మన షీ టీమ్స్ సభ్యులు.
సీపీ స్టీఫెన్ రవీంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది.

షీటీమ్స్ సభ్యులు సోషల్ మీడియాపై నిఘా వేసి, 50 మంది వరకు ఆకతాయిల భరతం పట్టారు.వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.మరో సారి ఇలాంటి పనులు చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష ఖాయమని హెచ్చరించి వదిలారు.
ఇకపై సోషల్ మీడియాలో ఆకతాయి పనులు చేసే వారికి హెచ్చరికలు పంపారు.ఏ మాత్రం శ్రుతి మించినా, తాము గమనిస్తున్నామని చెబుతున్నారు షీ టీమ్స్ సభ్యులు.ఏదేమైనా మహిళల, అమ్మాయిల భద్రతకు సైబరాబాద్ షీ టీమ్ చేపట్టిన ఆన్‌లైన్ గస్తీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.








