రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భారీగా నష్టపోతోంది.నిన్న మొన్నటి వరకు ప్రకృతి రమణీయత, అందమైన తోటలు, నగరాలతో పర్యాటకులను అలరించిన ఆ దేశం.
ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోంది.ఎటు చూసినా సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తోంది.
ప్రాణ భయంతో ఇప్పటికే లక్షలాది మంది ఉక్రెయిన్ వాసులు ఐరోపా దేశాలకు వలస వెళ్లిపోయారు.ఇక మిగిలి వున్న జనం . రష్యాపై పోరాడేందుకు ఆయుధం పట్టారు.ఇదే సమయంలో అంతర్జాతీయ సాయం కోసం ఉక్రెయిన్ వాసులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే పలు దేశాలు, స్వచ్చంద సంస్థలు మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు మందులు, ఆహారం, వైద్య సామాగ్రిని పంపుతున్నారు.
తాజాగా అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇండో అమెరికన్ సంస్థ కూడా ఉక్రెయిన్ వాసుల దీనస్థితికి స్పందించింది.
ఈ మేరకు 1 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని ఉక్రెయిన్‌కు పంపింది.మేరీ లాండ్‌కు చెందిన బయో ఫార్మా సంస్థ హ్యూమన్ బయో సైన్సెస్.మనోజ్, రీతూ జైన్ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో ఈ సాయం చేసింది.వార్ జోన్‌లో గాయాలపాలైన ప్రజలకు అత్యవసర వైద్యం చేసుకునేలా కొన్ని వస్తువులను పంపినట్లు సంస్థ తెలిపింది.
వాషింగ్టన్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ చేసిన అత్యవసర అభ్యర్ధనకు ప్రతిస్పందనకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యూమన్ బయో సైన్సెస్ తెలిపింది.

యుద్ధం కారణంగా విపత్కర పరిస్ధితుల్లో వున్న వారికి తమ వస్తువులు సహాయపడతాయని హ్యూమన్ బయో సైన్సెస్ ప్రెసిడెంట్ రోహన్ జైన్ ఆకాంక్షించారు.కొల్లాజెన్ సాంకేతికతతో ఈ సంస్థ తయారు చేసిన ఉత్పత్తులు గాయం కారణంగా ఎదురైన రక్తస్రావాన్ని ఆపడానికి హెమోస్టాట్‌గా పనిచేసి, తక్షణమే గాయాన్ని నయం చేస్తుంది.అలాగే గాయం మానిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో తక్కువ మచ్చలతో అందం చెడిపోకుండా కాపాడుతుంది.








