ఏపీలో ఇటీవల ఒకరకమైన ట్రెండ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.ఇప్పటిదాకా ఉన్నామా లేమా అన్నట్టు మాట్లాడిన ప్రతిపక్షాలు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నాయి.
ఏదో ఒకటి చేసి సునామీ సృష్టిస్తున్నారు.ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులు, సీఎం జగన్ ప్రధాన లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు.
మొన్నటిదాకా పవన్, పట్టాబి లాంటి వారు వైసీపీపై విరుచుకుపడిన విషయం విధితమే.తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ మంత్రులను టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేయడం గాలి దుమారాన్నే లేపుతున్నాయి.
వైసీపీకి మాత్రం గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి.
నిన్న ఉత్తరాంధ్ర టూర్‌లో భాగంగా వైసీపీ నేతలపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలంతా అలంకార ప్రాయులని, మంత్రులు ఎర్రి పుష్పాలని, తాము ఏపీలో అధికారంలోకొస్తే ఎర్రిపుష్పాల అవార్డులు ఇస్తామంటూ రెచ్చిపోయి మాట్లాడు.అసలు వారికి పవరే లేదన్నట్లు మాట్లాడం విమర్శలకు తావిస్తోంది.
ఏకంగా శ్రీకాకుళం జిల్లా మంత్రి సీదరి అప్పలరాజుపై విరుచుకుపడ్డారు.ఆయన నియోజకవర్గం పలాసాలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు కోసం కనీసం రూ.4కోట్లు కూడా ప్రభుత్వం నుంచి తీసుకురాలేకపోయాడని, తాము ఏమనుకోవాలంటూ నిలదీశారు.ఉత్తరాంధ్ర దుస్థితికి వైసీపీ పాలకులే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు మంత్రులకు, వైసీపీకి పట్టదని, ఈవిషయంలో బీజేపీ చూస్తూ సహించబోదని, పోరాటాలు చేస్తామని, తాగు,సాగు నీరందించని పాలన ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే.
రాష్ట్ర ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ మోసం చేస్తున్నారని, రైతులు పండించిన ధాన్యం కొంటున్నది దళారులు, మిల్లర్లేనని ఆరోపించారు.రైతు భరోసా కేంద్రాలు తూతూమంత్రంగానే ఉన్నాయని, పౌరసరఫరాల శాఖను రద్దు చేసుకోవడం మంచిందంటూ హితవు పలకడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు.మొత్తంమీద ఉత్తరాంధ్ర టూర్‌లో సోము చేసిన ఘాటు వ్యాఖ్యలు దేనికి దారి తీస్తాయి ? వైసీపీ నేతలు ఎలా ఎదుర్కుంటారు ? అనేది వేచి చూడాల్సిందే.