కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికాయే.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.
ఆ తర్వాత ట్రంప్ మేల్కొన్నప్పటికీ అప్పటికే పరిస్ధితి విషమించింది.రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో అగ్రరాజ్యంలో మృత్యుదేవత కరాళ నృత్యం చేసింది.
అసలు అమెరికా ఇప్పట్లో కరోనా విపత్తు నుంచి బయటపడుతుందా అన్నంతగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్.
తన తొలి లక్ష్యంగా కోవిడ్ కట్టడిని ఎంచుకుని తీవ్రంగా కృషి చేశారు.వ్యాక్సినేషన్ ఒక్కటే వైరస్‌కు విరుగుడుగా భావించిన ఆయన టీకా యజ్ఞం చేశారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపడంతో పాటు అదే రోజున కరోనా విముక్తి దినోత్సం కూడా నిర్వహించారు.
కానీ ఆ సంతోషం అమెరికన్లకు ఎక్కువరోజులు నిలబడేలా కనిపించడం లేదు… కరోనా వైరస్ తగ్గినట్లే కన్పించినా, గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది.
వైరస్ బారినపడిన వారు ఆసుపత్రులకు పోటెత్తుతుండటంతో పలు ప్రాంతాల్లోని ఐసీయూలు రోగులతో నిండిపోతున్నాయి.
రెండు వారాల క్రితంతో పోలిస్తే 12 రాష్ట్రాల్లోని ఐసీయూలలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆరోగ్య రంగంపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం కరోనా తాజా వేవ్‌ను సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాల్లో చికిత్స అందించేందుకు వైద్యులు, నర్సులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అరిజోనా, న్యూ మెక్సికో, గ్రేట్ ప్లెయిన్స్, మిన్నెసోటా వంటి ప్రముఖ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఒకవైపు దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతోంది.మరోవైపు శీతాకాలం ఎంటర్ కావడంతో వైరల్ వ్యాధుల బెడద ఎక్కువగా వుండటం.తాజాగా కరోనా కూడా తోడు కావడంతో వచ్చే కొన్ని నెలలు దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొంటాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనాకు ఫైజర్ సంస్థ మాత్రను తెచ్చినా ఇంకా అది అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు.







