గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.
వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.
అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.
ప్రయోగాలకు సంబంధించి ఈ కుబేరుల మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే.తొలుత బెజోస్ అంతరిక్ష యాత్ర గురించి ప్రకటించగా.ఆయన కంటే ముందే రోదసిలోకి వెళ్లిన ఘనతను దక్కించుకున్నారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్.అయితే వర్జిన్ కంటే ఎత్తుకు వెళ్లి ప్రత్యేకత చాటుకున్నారు బెజోస్.
వర్జిన్ గెలాక్టిక్ కంటే మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్’ యాత్ర సాగింది.బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక నేల నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
బెజోస్ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు.
అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు.
అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది.దీంతో బెజోస్ 106 కిలోమీటర్లు అంతరిక్ష యాత్ర చేశారు.
తాజాగా టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది.స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో ‘ఇన్స్పిరేషన్4’ పేరుతో నలుగురిని కక్ష్య లోకి పంపనున్నారు.
ఈ నలుగురు మూడురోజుల పాటు ప్రయాణించి తిరిగి భూమిపైకి చేరుకోనున్నారు.సెప్టెంబర్ 15న ఈ ప్రయోగం జరగనుంది.అమెరికాకు చెందిన పైలెట్, షిప్ట్ 4 పేమెంట్ సంస్థ అధినేత ఐజాక్మన్, సియాన్ ప్రొక్టర్, హేలీ ఆర్సెనియాక్స్, క్రిస్టోఫర్ సెంబ్రోస్కీలు స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో ప్రయాణించనున్నారు.సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఫండింగ్ కోసమే ఈ ప్రయోగం చేపట్టినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.స్పేస్‌లో ప్రయాణించనున్న వారి గురించి ఒకసారి చూస్తే.
జారెడ్ ఐజాక్మన్, బిలియనీర్ పైలట్:
ఈయన ఈ ప్రాజెక్ట్‌కు మిషన్ కమాండర్‌గా వ్యవహరించనున్నారు.38 ఏళ్ల ఈ అమెరికన్ షిఫ్ట్ 4 చెల్లింపుల సంస్థకు వ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.బ్యాంక్ కార్డ్ లావాదేవీలను ప్రాసెస్ చేయడంతో పాటు స్టోర్‌లు, రెస్టారెంట్‌ల సేవలను ఈ సంస్థ అందిస్తుంది.16 ఏళ్ల వయసులో ఇంటి బేస్‌మెంట్‌లో ఈ షిఫ్ట్ 4 సంస్థను స్థాపించారు ఐజాక్మన్.
విమానాలను నడపడమంటే అమితంగా ఇష్టపడే ఆయన.లైట్ జెట్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించిన రికార్డును కలిగివున్నారు.అంతేకాదు సైనిక విమానాలను సైతం నడిపేందుకు ఐజాక్మన్ అర్హత సాధించారు.
ఇదే సమయంలో 2012లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు శిక్షణనిచ్చే సంస్థను స్థాపించాడు.దీనిని డ్రేకెన్ ఇంటర్నేషనల్ అని పిలుస్తారు.
హేలీ ఆర్సెనియాక్స్, క్యాన్సర్ నుండి బయటపడిన వ్యక్తి:
ఆర్సెనెక్స్ బోన్ క్యాన్సర్‌కి గురై చిన్నతనంలోనే టెన్నిస్సీలోని మెంఫిస్‌లోని సెయింట్ జూడ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందింది.దీని కోసం జారెడ్ ఐజాక్మన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాడు.ఆమె ఈరోజు అదే ఆసుపత్రిలో ఫిజిషియన్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.
సియాన్ ప్రొక్టర్, ప్రొఫెసర్ :
51 ఏళ్ల ప్రొక్టర్ ఆరిజోనాలోని చిన్న కాలేజ్‌లో జియాలజీని బోధిస్తున్నారు.ఆమె తండ్రి నాసాలో ఉద్యోగి.అపోలో మిషన్ల సమయంలో ఆయన పనిచేశారు.హవాయిలో అంగారకుడిపై పోలినట్లు ఏర్పాటు చేసిన వాతావరణంలో సియాన్ వున్నారు.వ్యోమగామిగా మారడానికి సాసాకు ఆమె రెండు సార్లు దరఖాస్తు చేసింది.
ప్రస్తుత స్పేస్ ఎక్స్ మిషన్‌లో సియాన్ అసిస్టెంట్ కమాండర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
క్రిస్ సెంబ్రోస్కీ:
42 ఏళ్ల క్రిస్ యూఎస్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి.ఆయనకు ఇరాక్ యుద్ధంలో పనిచేసిన అనుభవం వుంది.ప్రస్తుతం వాషింగ్టన్‌లోని లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన ఏరోనాటిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
సెయింట్ జూడ్స్ హాస్పిటల్ నిధుల సేకరణలో భాగంగా విరాళం ఇచ్చిన తర్వాత ఆయన ఈ ప్రయోగానికి ఎంపికయ్యారు.