అమెరికాలో పుస్తక ప్రియులు, సాహితీ వేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16వ బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభంకానుంది.ఈసారి ఈ ఫెస్ట్‌లో భారతీయ, దక్షిణాసియా సంతతి రచయితల రచనలు పెద్దసంఖ్యలో భాగం పంచుకోనున్నాయి.
బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లిటరరీ కౌన్సిల్ తన 16వ బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ కోసం ప్రపంచవ్యాప్తంగా 140 మంది రచయితల జాబితాను ప్రకటించింది.
ఇందులో భారతీయ, దక్షిణాసియా సంతతికి చెందిన రచయితలు కూడా భాగం పంచుకున్నారు.వీరిలో నదియా అహ్మద్, రుమాన్ ఆలం, అనుక్ అరుద్‌ప్రగాసం, ప్రియాంక చంపానేరి, నిధి ఛానాని, రోహన్ ఛత్రి, సాయంతని దాస్ గుప్తా, అమీందర్ ధాలీవాల్, అబీర్ హోఖ్, సుజీత్ ఇందాప్, అమిత్వా కుమార్, రాఖీ మిర్చాందాని, సుమంత్ ప్రభాకర్, మయూఖ్ సేన్, నిషా శర్మ, జఫ్రీనుద్దీన్ తదితరులున్నారు.
9 రోజుల పాటు (సెప్టెంబర్ 26- అక్టోబర్ 4 ) జరిగే ఈ ఫెస్ట్.బ్రూక్లిన్ డౌన్‌టౌన్‌లో అనేక దశల్లో జరుగుతుంది.అలాగే సాయంత్రాల పూట వర్చువల్ ఫెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వున్న పాఠకులను చేరుకునే ప్రయత్నం చేస్తారు.అలాగే అక్టోబర్ 3న లైవ్ ఫెస్టివల్ డేలో రోజంతా ఫిక్షన్, కవిత్వం, నాన్ ఫిక్షన్, కామిక్స్, గ్రాఫిక్ నవలు ప్రదర్శించడంతో పాటు యువ రచయితల కార్యక్రమాలు వుంటాయి.
మెట్రోటెక్‌లోని బ్రూక్లిన్ కామన్స్ పార్క్‌లో అక్టోబర్ 2 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు, అభిమాన రచయితలు, చిత్రకారులతో కార్యక్రమాలు వుంటాయని నిర్వాహకులు తెలిపారు.
పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు.అలాగే READy, Spin, Win book wheel ఆడి బహుమతులు పొందవచ్చు.

బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ 2006లో ప్రారంభించబడింది.న్యూయార్క్ నగరంలోని విభిన్న ప్రాంతాలను దగ్గరకు చేర్చడమే దీని ఉద్దేశం.2009లో ఈ ఫెస్టివల్‌కు దాదాపు 30000 మంది హాజరయ్యారు.అలాగే అదే సంవత్సరం రచయితలను ప్రోత్సహించేందుకు గాను సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ వారు 50,000 డాలర్ల విలువైన ద్వైవార్షిక సాహిత్య బహుమతిని ప్రవేశపెట్టారు.
ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ సందర్భంగా విజేతను నిర్వాహకులు ప్రకటిస్తారు.