అతను ఒక ప్రజాప్రతినిధిగా మరియు రాష్ట్రానికి మంత్రిగా ఉన్నతమైన పదవిలో కొనసాగుతున్నాడు.కరోనా కోరలు చాస్తున్న సమయంలో ప్రజలకు కోవిడ్ సోకకుండా జాగ్రత్తలు వివరించాల్సిన వ్యక్తి, స్వయంగా తానే నిబంధనలకు గాలికి వదిలేస్తున్నాడు.
అంతే కాకుండా కరోనా రాకుండా ముక్కు, నోటికి పెట్టుకోవాల్సిన మాస్కును కాలి వేలికి పెట్టుకుని నవ్వుల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే… ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో చెరకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న స్వామి యతిశ్వరానంద్ ఇండోర్‌లోని భారతీయ జనతా పార్టీ సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ సమావేశానికి హాజరైన మరొక ఇద్దరు రాష్ట్ర మంత్రులు బిషన్ సింగ్ చుఫాల్, సుబోద్ యునియల్, బీజేపీ నాయకులెవరూ కూడా మాస్కు ధరించలేదు కానీ, మంత్రి యతిశ్వరానంద్ కాలికి మాత్రం మాస్క్ కనిపించింది.దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో కనిపించడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
ప్రజలకు కోవిడ్ నిబంధనల గురించి వివరించాల్సిన ఓ రాష్ట్ర మంత్రి, నిబంధనలను గాలికి వదిలేయడమే కాకుండా మూతికి ధరించాల్సిన మాస్కును కాలికి పెట్టుకోవడంతో ప్రజలు భగ్గుమంటున్నారు.ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు ఇలా చేయడం వల్లే కరోనా విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఈ విషయంపై ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రతిపక్ష పార్టీలు అన్నీ మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.కరోనా నిబంధనలు పాటించి, అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన రాష్ట్ర మంత్రే అజాగ్రత్తగా వ్యవహరించడం సరైనది కాదని కాంగ్రెస్, అమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, ప్రజలకు తగిన నియమాలు పాటించాలని చెప్పాల్సిన ప్రభుత్వానికి చెందిన మంత్రులే ఇలా వ్యవహరించడం సరి కాదన్నారు.కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.