సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన గుండమ్మ కథ ఆయా హీరోల కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడంతో పాటు నటులుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ కు మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.విజయా సంస్థ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాలో గుండమ్మ పాత్రలో ప్రముఖ నటి సూర్యకాంతం నటించారు.
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ ప్రముఖ రచయిత డి వి నరసరాజు గురించి చెబుతూ ఆయన రచయితల సంఘానికి భీష్మాచార్యుడు అని వెల్లడించారు.తాను నిక్కర్లు వేసుకున్న రోజుల్లో నరసరాజు గారి సినిమాలను చూశానని నరసరాజు సినిమాల్లో ముఖ్యమైన సినిమా గుండమ్మ కథ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.గుండమ్మ కథ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ నిక్కరులో కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ను నిక్కరులో చూపిస్తే జనాలు కొడతారేమోనని విజయా సంస్థ నిర్వాహకులు భావించి భయపడ్డారు.ఈ మూవీ రిలీజ్ కు పది రోజుల ముందే ఫంక్షన్ కు హాజరైన బంధువులకు సినిమా వేశారు.సినిమా వారికి నచ్చడంతో విజయా వారు కూడా ధైర్యంగా సినిమాను రిలీజ్ చేశారు.సినిమా రిలీజైన తర్వాత సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో, ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్ లో గుండమ్మ కథ రీమేక్ వస్తుందని వార్తలు వినిపించాయి.బాలకృష్ణ గుండమ్మ కథను రీమేక్ చేస్తే జనాలు ఆదరిస్తారా.? అనే సందేహం వ్యక్తం చేయగా జూనియర్ ఎన్టీఆర్ సూర్యకాంతం పాత్రకు సరిపోయే నటి దొరకదని భావించి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు సమాచారం.అయితే ప్రేక్షకులు మాత్రం గుండమ్మ కథ రీమేక్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.