లక్షలాది కేసులు, వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల వరుసలు, అంత్యక్రియల కోసం జాగా లేక ఎదురుచూపులు.ఏడాది క్రితం వరకు అమెరికాలో పరిస్థతి ఇలా వుండేది.
ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినవారికి అమెరికా ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానం కలిగింది.కానీ అగ్రరాజ్యం తన సర్వశక్తులు ధారపోసి మహమ్మారి కోరల్లో నుంచి బయటపడింది.
ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.దీనితో నెమ్మదిగా ఆంక్షల చట్రం నుంచి అగ్రరాజ్యం బయటపడుతోంది.
ఇకపై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీనిపై అనుమానాలు, గందరగోళం వున్నా అమెరికన్లు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారన్నది మాత్రం నిజం.
అందుకు తగ్గట్టుగానే.ప్రజలు మాస్క్, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించకుండా పలకరింపులు, షేక్ హ్యాండ్‌లు, ఆలింగనాలు చేసుకుంటూ ఏంజాయ్ చేస్తున్నారు.
అటు అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోనూ పండగ వాతావరణం కనిపిస్తోంది.అధికారులు, సిబ్బంది మాస్క్‌లు లేకుండా తిరుగుతూ, గతంలో మాదిరి ఒకొరినొకరు ఆలింగనాలు చేసుకుంటున్నారు.
అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రముఖులు ఎగబడుతున్నారు.

అయితే ప్రస్తుత పరిస్ధితిని చూసి సంబరపడొద్దని వార్నింగ్ ఇస్తోంది యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ).ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కరోనా వేరియంట్లకు చెక్ పెట్టినప్పుడే అమెరికా సురక్షితమని హెచ్చరించింది.వాటిని కట్టడి చేయకపోతే పూర్తిస్థాయిలో టీకాలు అందినప్పటికీ.
దేశ ప్రజలకు రక్షణ లభించదని యూఎస్ఏఐడీ స్పష్టం చేసింది.
అలాగే దక్షిణాసియాలో కొత్త వేరియంట్ల వ్యాప్తి కలవరం పుట్టిస్తోందని యూఎస్‌ఏఐడీకి చెందిన జెరేమీ కొనిన్‌డిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
వాటిని కట్టడి చేసే ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.మరోవైపు, కరోనా సెకండ్ వేవ్‌తో వణికిపోతున్న భారత్‌కు సాయం కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
తమ దేశంలో టీకా లక్ష్యాన్ని చేరుకున్నాక ఇతర దేశాలకు టీకాలు అందిస్తామని ఆయన చెప్పారు.