పదుల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో నటించిన గిరిబాబు ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.తాజాగా గిరిబాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ మా అబ్బాయి సినీ కెరీర్ నాశనం కావడానికి కొన్ని శక్తులు కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కౌబాయ్ సినిమాగా తన కొడుకు బోసుబాబుతో తెరకెక్కించిన ఇంద్రజిత్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రోజుకే చిరంజీవి నటించిన కొదమ సింహం సినిమా ప్రీ పోన్ అయిందని గిరిబాబు తెలిపారు.
చిరంజీవి సినిమా ప్రీ పోన్ కావడం వల్ల గిరిబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తన సినిమాను వాయిదా వేశారు.
అయితే భారీ అంచనాలతో విడుదలైన కొదమ సింహం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.ఆ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం తన సినిమాపై పడిందని గిరిబాబు చెప్పారు.
కౌబాయ్ కథతో తెరకెక్కిన చిరంజీవి సినిమానే ఫ్లాప్ కావడంతో కొత్త హీరోతో కౌబాయ్ కథతో తెరకెక్కిన తన సినిమా ఎలా హిట్ అవుతుందని కామెంట్లు వినిపించాయని గిరిబాబు పేర్కొన్నారు.

తన కొడుకు బోసుబాబు ఆ సినిమాలో నటించడంతో కొదమసింహం రిలీజైన 45 రోజుల తర్వాత ఇంద్రజిత్ సినిమాను రిలీజ్ చేశానని గిరిబాబు అన్నారు.40 లక్షల రూపాయల ఖర్చుతో తెరకెక్కించిన ఇంద్రజిత్ సినిమాను కేవలం 20 లక్షలకే అమ్మాల్సి వచ్చిందని గిరిబాబు పేర్కొన్నారు.అయితే సినిమా రిలీజైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో పాటు సినిమాను కొన్న బయ్యర్లకు లాభాలు వచ్చాయని గిరిబాబు తెలిపారు.
చాలా థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు ఆడినప్పటికీ కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేయడం వల్ల బోసుబాబు కెరీర్ పై ప్రభావం పడిందని గిరిబాబు అన్నారు.ఆ సినిమా తరువాత తాను సినిమా నిర్మాణానికి దూరమయ్యానని కొన్ని శక్తులు కలిసి తనకు తీరని వేదనను మిగిల్చాయని గిరిబాబు వెల్లడించారు.