భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజుకు మూడు లక్షల పైచిలుకు కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో ఇండియా వణికిపోతోంది.
కోవిడ్ చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.దీంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
అత్యవసర స్థితిలో వున్నవారికి బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు దొరక్కపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.అన్నింటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ సంక్షోభం దేశాన్ని కుదిపేస్తోంది.
ఆక్సిజన్ కొరతతో కొన్ని ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడంలేదు.మరికొన్ని ఆస్పత్రులు ఇప్పటికే చేరిన రోగులను డిశ్చార్జ్ చేస్తున్నాయి.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలకు ఉపక్రమించింది.ప్రాణవాయువును సరఫరా చేసే ట్యాంకర్లను అడ్డుకుంటే ఎవరైనా సరే ఉరేస్తామని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించిందంటే పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో పీకల్లోతు కష్టాల్లో వున్న భారత్‌ను ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది.అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సింగపూర్, యూకే, జర్మనీ, యూరోపియన్ యూనియన్, చైనా, పాకిస్తాన్‌లు ఇండియాకు బాసటగా నిలిచాయి.
అటు పుట్టెడు కష్టంలో వున్న జన్మభూమిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు సైతం బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు మద్ధతుగా నిలిచారు భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా.
ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడానికి వనరులు అసవరమయ్యే భారతీయ ఆసుపత్రులకు తాను నిధులు సమకూరుస్తానని వినోద్ ఖోస్లా ప్రకటించారు.ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.
సాయం కావాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.

మరోవైపు భారతీయ అమెరికన్ సంఘాలు కూడా భారత్‌కు సాయం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.దీనిలో భాగంగా ప్రముఖ ఎన్జీవో సంస్థ SEWA ఇంటర్నేషనల్.5 మిలియన్ డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.అలాగే 400 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సహా అత్యవసర వైద్య సామాగ్రిని భారత్‌కు పంపుతున్నట్లు సేవా సంస్థ తెలిపింది.భారతీయ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించేందుకు గాను “Help India Defeat COVID-19’’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.
వీటితో పాటు సేవా సంస్థ దేశంలోని 10000 కుటుంబాలకు, 1,000కి పైగా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం, మందులను అందిస్తామని తెలిపింది.