చివరి నిమిషం వరకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ఎత్తులు వేసినా, చివరకు న్యాయస్థానం చొరవతో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది.నామినేషన్ల ఘట్టం మొదలైంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు అయిపోయింది.ఈ విషయంలో తాము విజయం సాధించాము అని తెలుగుదేశం పార్టీ అప్పుడే సంబరపడిపోతోంది.
అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు సైతం టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది పక్కన పెట్టి మరీ ప్రస్తుతం వైసిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి టిడిపి సంబరపడిపోతోంది.
వైసిపి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు అందరినీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్ చేసుకుని వారిని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజ్యాంగం ప్రకారం నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఎటువంటి వ్యతిరేక చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో, ఇప్పుడు పూర్తిగా టిడిపిని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ మేరకు ఒక వ్యూహం కూడా సిద్దమయినట్టు సమాచారం.ఈ ఎన్నికలు తంతు ముగియగానే ఫలితాలు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా, వాటిని పక్కన పెట్టి పూర్తిగా టిడిపిని టార్గెట్ చేసుకొని మరింత దెబ్బ తీయాలనే వ్యూహానికి వైసిపి పథకం రచించినట్లు తెలుస్తోంది.
టిడిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వాలి అంటే కనీసం 17 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
దీంతో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను తమ దారిలోకి వచ్చేలా చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా, అలాగే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రద్దు అవుతుందని, ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన సైతం వెలువడుతుందని, ఆ రకంగానైనా టిడిపి ని పూర్తిగా దెబ్బ తీయవచ్చు అని వైసీపీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తమ తో టచ్ లో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు లిస్టు తయారు చేసుకుని సరైన సమయంలో వారు టీడీపీకి రాజీనామా చేసే విధంగా సరికొత్త ఎత్తుగడను అమలు చేయబోతున్నారట.