ద్వై మాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బిఐ శుక్రవారం వెల్లడించింది.నిపుణుల అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలకమైన వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది.రేపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతం గా కొనసాగించే విధంగా ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది.దీంతో పాటు ‘అకామిడేటివ్’ విధానాన్ని కొనసాగిస్తామని ఆర్.బి.ఐ గవర్నర్ తెలియజేశారు.
కరోనా పోరు ప్రభావం లో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మకమైన దశలోకి ప్రవేశించింది అని గవర్నర్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.అప్పటికి జీడీపీ వృద్ధిరేటు పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు దారిలో పడతాయి అన్నారు.
ప్రస్తుతం ఆర్బీఐ వద్ద కావలసినంత నగదు ఉందని శక్తికాంత్ దాస్ తెలియజేశారు.ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు రూ.20,000 కోట్ల వరకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ఆర్బిఐ రియల్ వృద్ధిరేటు 9.5 శాతం వరకు తగ్గవచ్చని అంచనావేసింది.చివరి సారిగా మే 22న ఆర్.బి.ఐ వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.రెపో రేటును అత్యంత కనిష్టంగా 4 శాతానికి పరిమితం చేసింది.
ఆతర్వాత ద్రవ్యోల్బణం నానాటికీ పెరుగుతుండడంతో మే నెల తర్వాత నుంచి ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదని ఆయన ప్రకటించారు.