ఇప్పుడు ఆన్లైన్లో వ్యాపారం బాగా విస్తరించడంతో ఏది కావాలన్నా మన ముందుకే వచ్చి పడుతోంది.మనం ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కోరిన సరుకు కాళ్ల ముందుకు వచ్చేలా అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి.
బట్టలు, మొబైల్ ఫోన్ లు, మనం తినే ఫుడ్ అన్నీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.అయితే ఇప్పుడు డీజిల్ కూడా ఇదే విధంగా పొందే అవకాశం ఆన్లైన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది.
ఈ ప్రయోగాన్ని విశాఖపట్నంలో ప్రారంభించగా ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.అధిక మోతాదులో ఉపయోగించేవారు ఫోన్ లో యాప్ సహాయంతో సులభంగా డీజిల్ ను తెప్పించుకోవచ్చు.
ఈ మేరకు భారత్ పెట్రోలియం సంస్థ తొలిసారిగా విశాఖలో ఈ విధానాన్నిప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.ఇప్పటికే ఈ విధానం మైసూర్, కోయంబత్తూర్, పూణే వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.
ఇప్పుడు ఏపీలో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.అయితే ఆన్లైన్ ద్వారా లభించే డీజిల్, బయట మార్కెట్లో దొరికే డీజిల్ ఓకే రేటుకు లభిస్తుంది.200 నుంచి నాలుగు వేల లీటర్ల వరకు ఈ విధానం ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
డీజిల్ ను ఆన్లైన్లో బుక్ చేయాలంటే ముందుగా రెపోస్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
అందులో పేరు చిరునామా వివరాలతోపాటు ఎన్ని లీటర్ల డీజిల్ సరఫరా చేయాలి, ఏ తేదీన డీజల్ కావాలి అనే విషయాలను ఎంటర్ చేయాలి.ఆ తరువాత ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలి.
దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది.
ఇక ఈ విధానానికి జియో ట్యాగింగ్ ఉండడంవల్ల డీజిల్ తెచ్చే వాహనం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆయిల్ బుక్ చేసిన తర్వాత బుక్ చేసిన ఫోన్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది.ఆ నెంబర్ నమోదు చేస్తే ఆయిల్ అన్లోడ్ అయ్యే విధంగా దీనిని రూపొందించారు.







