ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తన మన మార్క్ కనిపించాలని జగన్ ప్రభుత్వ కార్యాలయాలన్నిటికి కొత్తగా రంగులు వేయిస్తున్నాడు.అయితే ఆ రంగులు వైసీపీ పార్టీ గుర్తుతో ఉండడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
గుడి, బడి అనే తేడా లేకుండా వైసీపీ రంగులతో ఏపీ మొత్తం కప్పేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ పార్టీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మధ్యకాలంలో ఓ పంచాయతీ కార్యాలయం గోడ మీద ఉన్న జాతీయ జెండా రంగును సైతం మర్చి వైసీపీ విమర్శలపాలయ్యింది.
ఇటువంటి సంఘటనే మరోచోట చోటుచేసుకోవడంతో జనసేన అధినేత పవన్ మరోసారి దీనిపై స్పందించారు.ఇప్పటికే ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇప్పడు విజయనగరం జిల్లాలో ఇదే తరహాలో మహాత్మా గాంధీ విగ్రహానికి రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.‘వైసీపీ రంగులతో మొన్న జాతీయ జెండా, ఈ రోజు గాంధీజీ, రేపు ఎవరు శ్రీ జగన్ రెడ్డి జీ ???’ అని పవన్ ట్వీట్ చేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేసి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని పవన్ వ్యాఖ్యానించారు.