ఓటమి నుంచి తొందరగా తేరుకోవడంతో పాటు నిరాశ నిస్పృహల్లో ఉన్న కార్యకర్తల్లో దైర్యం నూరిపోయాలని చంద్రబాబు తపిస్తున్నాడు.అందుకే జిల్లాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ వారికి ధైర్యం చెప్పే పనిలో ఉన్నాడు.
అందుకే బాబు ఇప్పుడు వరుస వరుసగా పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల వారీగా, ఓటమికి దారి తీసిన కారణాలపై చర్చిస్తున్నారు.మనం ప్రస్తుతానికి అధికారంలో లేకపోయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలపై పోరాటం మొదలుపెట్టాలని, క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త జోష్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ప్రస్తుతం బాబు టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో, పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
అయితే కీలకమైన ఈ సమావేశానికి జిల్లాలోని ముఖ్యమైన నాయకులు హాజరుకాకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

మరీ ముఖ్యంగా చెప్పుకుంటే రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, బాబు నిర్వహించిన సమావేశానికి రాలేదు.దీంతో ఆయన అనుచరులుగా చెప్పుకునే కీలక నాయకులు చాలామంది ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు.కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీలో కీలక నేతగా పేరొందిన బొడ్డు భాస్కర రామారావు కూడా ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు.
పార్టీకి ఇంతటి కీలకమైన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు తెలియక బాబు తీవ్ర ఆందోళన చెందారట.తాను ఈ మీటింగ్ ఎంతో కీలకమని చెప్పినా వీరు రాకపోవడం ఏంటని బాబు తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేశారట.
ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కాపు నాయకులందరినీ ఏకంచేసి సమావేశం నిర్వహించిన రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పార్టీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆయన అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట, కానీ ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లా కీలక మీటింగ్‌కు కూడా రాకపోవడం, ఈ ప్రచారానికి మరింత ఊతం ఇస్తోంది.ఇక మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా బీజేపీ వెళ్లే ఆలోచనతో ఉండడంతోనే బాబు మీటింగ్ కు హాజరుకాలేనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు దొరబాబు సమావేశం జరుగుతున్న కాకినాడలోనే ఉన్నా పార్టీ మీటింగ్‌కు హాజరుకాకపోవడం హాట్ టాఫిక్ గా మారింది.ఈయనతో పాటు మరో పదిమంది కార్పొరేటర్లు కూడా డుమ్మా కొట్టారు.
ఈ విధంగానే చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు సమావేశాలకు హాజరుకాకుండా డుమ్మా కొట్టి పెద్ద చర్చకే తెరలేపారు.ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారట.
ఓడిపోయినంత మాత్రాన సర్వస్వం కోల్పోయినట్టు కొంతమంది నేతలు తెగ బాధపడిపోతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, పదవులు లేకపోయేసరికి అలాడిపోతున్నారు అంటూ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారట.







