ఏపీలో రాజకీయ వలసలు ఊపందుకున్న తరుణంలో జనసేన పార్టీ అనూహ్యంగా స్పీడ్ పెంచింది.వైసీపీలోకి వెళ్లేందుకు ఇష్టం లేని నాయకులు బీజేపీ వైపు వెళ్తుండగా ఆ పార్టీలోకి కూడా వెళ్లడం ఇష్టం లేని వారు ఇప్పటివరకు సైలెంట్ గా ఉండిపోయారు.
అయితే కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు ప్రదర్శిస్తుండడంతో చాలామంది నేతలు జనసేన పార్టీలో చేరితే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో పడ్డారు.వరుస వరుసగా నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌కు వెళ్లారు.

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు.దిండి రిసార్ట్స్‌లో పవన్ కళ్యాణ్‌తోనూ భేటీ అయ్యి తాజా రాజకీయాలతో పాటు, తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా పవన్ తో సుదీర్ఘంగా చర్చించాలని వంగవీటి రాధా చూస్తున్నాడు.ఎన్నికల సమయం ముందు రాధా తాను పోటీ చేసే నియోజకవర్గం పై వైసీపీతో విభేదించారు.విజయవాడ సెంట్రల్ సీటును వంగవీటి ఆశించారు.అయితే ఈ నియోజకవర్గంలో మల్లాది విష్ణును జగన్ బరిలోకి దింపారు.దీంతో రాధా తన అసంతృప్తిని తెలియజేసారు.
స్వయంగా జగన్ రాధాకృష్ణ తో మాట్లాడి సర్దిచెప్పినా ఆయన ససేమీరా అనడంతో పాటు వైసీపీ కి గుడ్ బాయ్ చెప్పి టీడీపీలో చేరారు.
కాని ఆయనకు బాబు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు.
సీటు రాకపోయినా దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని భావించారు.కానీ అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో రాధా రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది.
అందుకే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాధా రంగ అభిమానులు కూడా జనసేన పార్టీలో చేరాల్సిందిగా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
ఇక పవన్ రెండు రోజుల పర్యటన విషయానికి వస్తే సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే పవన్ ఉండబోతున్నారు.







