వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది.151 అసెంబ్లీ సీట్లు సాధించి ఏపీలో తమ బలం ఏంటో చూపించింది.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడినట్టు అందరికీ అర్ధం అయ్యింది.అయితే ప్రస్తుతం ఉన్న బలం సరిపోదని ఇంకా బలపడాలనే ఆలోచన వైసీపీ అధినేత జగన్ లో బలంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టింది.ఒకవైపు పరిపాలన, మరో వైపు పార్టీ బలోపేతంపై జగన్ దృష్టిసారించారు.దీనిలో భాగంగానే జిల్లాల వారీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయాలని జగన్ భావిస్తున్నారట.పార్టీ అధికారంలో ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి క్యాడరే బలం.అధినాయకుడితోపాటు నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో కష్టపడితేనే ఫలితం దక్కుతుంది.

పరిపాలనా వ్యవహారాల్లో జగన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ బలోపేతంపై జగన్ దృష్టిపెట్టారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్నందున ఒకవైపు పరిపాలన, మరో వైపు పార్టీ ని బలోపేతం చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నాడు.దీనిలో భాగంగానే ప్రస్తుతం పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది ? ఏం చేస్తే బాగా బలం పుంజుకుంటుందనే అంశాలపై ఆరా తీసేపనిలో ఉన్నారు.క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఎంపీ విజయసాయిరెడ్డికి జగన్ అప్పగించినట్టు సమాచారం.ముందుగా వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేసి ఆ తరువాత మండలస్థాయి, జిల్లా స్థాయి నాయకులను నియమించి, లోకల్ కేడర్‌ను పటిష్టం చేయాలని భావిస్తున్నారు.

దీని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా జగన్ ఏర్పాటు చేశారు.త్వరలోనే జిల్లాల వారీగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, పార్టీ కేడర్ ను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ 50 శాతం ఓట్లు సాధించి విజయాన్ని అందుకున్నప్పటికీ తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ కూడా దాదాపు 40శాతం వరకు ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటికీ టీడీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉండడంతో ఆ ఓటు బ్యాంక్ ను ఎలా అయినా చెదరగొట్టాలనే ఆలోచనలో వైసీపీ ఉంది.
అందులో భాగంగానే సంకేశేమ పథకాలను పార్టీల బేధం లేకుండా అందరికీ అందేలా చేయాలని, తద్వారా పార్టీపై ప్రతికూలత పెరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నారు.అలాగే పార్టీలో నెలకొన్న గ్రూపు విబేధాలు, వర్గపోరును పక్కనపెట్టి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేసేలా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.







