పరిపాలన లో పారదర్శకత, జవాబుదారీతనం ఇలా అన్ని విషయాల్లోనూ జగన్ ప్రజల నుంచి మంచి మార్కులే కొట్టేసాడు.జగన్ అధికారం చేపట్టి నెల రోజులు ముగిసిన సందర్భంగా ఆయన పాలన ఎలా ఉంది అనే విషయంపై విశ్లేషణ మొదలయ్యింది.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న జగన్ 30 రోజుల్లో 30 సంచనాలు సృష్టించారంటున్నారు విశ్లేషకులు.నవ్యాంధ్ర రెండో సీఎం వైఎస్.
జగన్ 30 రోజుల పాలనలో తన మార్క్ హామీలను అమలు చేసే దిశగా వెళ్తూ, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, ఏపీలో సంస్కరణలకు బీజం వేస్తూ ముందుకు వెళ్తున్నాడు.మంత్రివర్గ ఏర్పాటులో కూడా ఎవరి ఊహకు అందని విధంగా మంత్రుల ఎంపిక పూర్తి చేసాడు.

జగన్‌కు సీఎం అవ్వాలన్న కోరికే కాని , పరిపాలన చేయడానికి ఆయనకు ఏమి అర్హత ఉంది ? అంటూ పదే పదే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్‌లు వేస్తూ, అంచనాలను తలకిందులు చేస్తూ, పాలనలో తన మార్క్‌ను చూపిస్తున్నాడు.ఎన్నో హామీలు, ఆపై మరిన్ని సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.అటు కేంద్రం, ఇటు పొరుగు రాష్ట్రాల సీఎంలతో స్నేహంగా మెలుగుతూ కావాల్సిన నిధులను ఏపీకి తీసుకొస్తున్నాడు.విభజన కష్టాల్లో ఉన్న ఏపీకి ఇప్పటికి ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
అయినా తన పాలనలో అవినీతి లేకుండా ఉండాలన్నది జగన్ సంకల్పంగా కనిపిస్తోంది.ప్రమాణస్వీకారోత్సవం సమయంలో జగన్ తన ప్రసంగంతోనే ఏపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ముఖ్యమంత్రిగా జగన్ 30 రోజుల్లో 30 సంచలన నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పుకోవాలి.ఎన్నికల ముందు తాను ఏం చెప్పారో వాటిని పక్కాగా అమలు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్న జగన్ తొలి పథకం కింద ఈ రబీ సీజన్ నుంచే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని పట్టాలెక్కించారు.పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.పింఛన్లను దశల వారీగా 3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్‌ను రూ.2,250కు పెంచారు.ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు.ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు 11,500కు పెంచడంతో రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం కల్పించారు.
పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా 18 వేలకు పెంచారు.హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు కూడా పెంచేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముప్పై రోజుల్లో అనేక సంచలన నిర్ణయాలతో జగన్ రికార్డు సృష్టించారని చెప్పాలి.