నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త చర్చకు తెర లేసింది.తెలుగు సినిమాను ఏపీకి షిప్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడు.
కనీసం అక్కడ ఒకటి రెండు స్టూడియోలు అయినా నిర్మింపజేయడంలో చంద్రబాబు నాయుడు సఫలం కాలేదు.కారణం వైజాగ్ అమరావతి అంటూ అటు ఇటు చిత్ర నిర్మాతలను చంద్రబాబు కన్ఫ్యూజ్ చేశాడు.
ఎక్కడ స్టూడియోల ఏర్పాటు చేయాలో అర్థం కాలేదు.

చంద్రబాబు తీరు కారణంగా గత అయిదు సంవత్సరాల్లో ఏపీలో స్టూడియోల నిర్మాణం జరుగలేదు.ఇప్పుడు జగన్ అయినా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కోరుతున్నాడు.చంద్రబాబు నాయుడు వ్యవహరించినట్లుగా కాకుండా జగన్ చురుకుగా వ్యవహరించి తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలో కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటే ఏపీ యువతకు బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వైజాగ్ లేదా అమరావతి ఈ రెండింటిలో ఏది అయితే బెటర్ అనేది ఒక నిర్ణయానికి వచ్చి, స్టూడియోల నిర్మాణంకు రాయితీలు ప్రకటిస్తే తనవంటి నిర్మాతలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు స్టూడియోల నిర్మాణంకు ముందుకు వస్తారంటూ జగన్ కు సురేష్‌బాబు సూచించాడు.తెలుగు సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లో ఉంటుందని, పూర్తిగా ఏపీకి తరలి వెళ్లవల్సిన అవసరం లేదని, అక్కడ ఇక్కడ చిత్రీకరణ చేసుకునే వీలుగా పరిశ్రమ అక్కడ ఇక్కడ ఉండాలని సురేష్‌బాబు అభిప్రాయ పడ్డాడు.