ఏపీ రాకీయాల్లో వేలుపెడతామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి అనేక విమర్శలు చేస్తూ వచ్చింది.కానీ ఆ విమర్శల ఫలితంగా టీడీపీకి మైలేజ్ పెరిగి తమ ఆప్త మిత్రుడు జగన్ కు కీడు జరుగుతోందని భావించిన వారు కొంచెం సైలెంట్ అయిపోయారు.
దీంతో కేసీఆర్ ప్రకటించిన రిటర్న్ గిఫ్ట్ అందట్లేదని టీడీపీ వ్యతిరేక పార్టీలు భావించాయి.ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై మళ్లీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అంటూ జోస్యం చెప్పాడు.

ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోక తప్పదని హెచ్చరించారు.ఏపీ ప్రజలు కూడా బాబు పాలనపై విసిగిపోయి ఉన్నారని, అందుకే ఈసారికి రిటైర్మెంట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారని, అది జరిగి తీరుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని , కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్‌ని తిడితే చంద్రబాబుకు ఓట్లు రావన్నారు.ఏపీతో సంబంధాలున్న ఓటర్లంతా జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో తమకే ఓటేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

ప్రస్తుతం ఏపీ మొత్తం ఫ్యాను గాలే వీస్తోందని, ఈ విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా అర్ధం అయ్యిందన్నారు.తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని, 16 సీట్లు సాధించడం ఖాయం అని.ఖమ్మం, సికింద్రాబాద్‌లోనూ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతోంది కేటీఆర్ ధీమా వ్యక్తం చేసాడు.ఏపీలో జగన్ మెజారిటీ సీట్లు సాధిస్తారని, ఆయనతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పుతామన్నారు కేటీఆర్.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.







