తాము ఇన్నాళ్లు రాజకీయాల్లో బాగానే రాణించాము.ఎన్నో పదవులు పొందాము.
ఇక రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్నాము.ఈ సమయంలో తమ రాజకీయ వారసులను కూడా రంగంలోకి దించి వారికి కూడా రాజాకీయ భవిష్యత్తు ఇవ్వాలని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెగ ఆరాటపడుతున్నారు.
అసలే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల హవా ఎక్కువ ! దీనికి తోడు గ్రూపు రాజకీయాలు.ఈ నేపథ్యంలో ఒక నేత వారసుడికి టికెట్ వస్తే మా వారసుడికి టికెట్ ఎందుకు ఇవ్వరు అనే కోణంలో అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది ఉన్నారనే సమాచారంతో అధిష్టానం దిక్కుతోచని స్థితిలో ఉంది.

ఏ నేత కుమారుడికి టికెట్ ఇస్తే ఏ నేతకు కోపం వస్తుందో తెలియని పరిస్థితి.పోనీ వారసుడి కోసం సీనియర్లు టికెట్ త్యాగం చేస్తున్నారా అంటే అదీ లేదు.మాకు టికెట్ కావలి మా వారసుడికి టికెట్ కావాలనే పంతం లో వారు ఉన్నారు.ఒక పక్క మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కాక తలనొప్పిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కి ఇది మరో తలనొప్పిగా మారింది.
ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తుండటంతో అలెర్ట్ అయ్యారు.తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడానికి హస్తిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో ఇప్పుడు సీనియర్ నాయకుడు జానారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.కొడుకు రఘువీర్ పొలిటికల్ ఎంట్రీ విషయమై ఆయన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలది ఇప్పుడు అదే పరిస్థితి.మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు.ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌లో ప్రచారం మొదలు పెట్టారు.అంజన్‌కుమార్ యాదవ్ కొడుకు అనిల్‌యాదవ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ముషీరాబాద్ నుంచి పోటీకి పావులు కదుపుతున్నారు.
ఇక మాజీ మంత్రి డీకే అరుణ తన కుమార్తెను ఎన్నికల బరిలో దించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు.మరో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా తన కొడుకు సర్వోత్తమ్‌రెడ్డికి టికెట్ కోరుతున్నారు.
వీరే కాకుండా మరి కొంతమంది నాయకులు తమ వారసులను రంగంలోకి దించేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.