ఎంత కష్టపడినా ఏం లాభం లేకుండా పోతుంది.కాబట్టి ఒక్కటి ఒకే ఒక్కటి దొంగతనం చేసేస్తే ఎంచక్కా సెటిల్ అయిపోవచ్చనుకున్నారు ఆ దొంగలు.
దొంగతనం ఎక్కడ చేయాలి,ఎవర్ని చేయాలి,ఎలా చేయాలి అని స్కెచ్ వేసుకున్నారు.పథకం ప్రకారమే దొంగతనం చేశారు.
తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది.ఆఖరికి చేతిలో ఐదురూపాయల బిళ్ల,చిప్పకూడు మిగిలింది.
ఢిల్లీకి చెందిన 43 ఏళ్ల ఓ వ్యక్తికి దుస్తుల తయారీ ఫ్యాక్టరీ ఉంది.ఇఫ్తేకర్ ఖలీద్ అనే వ్యక్తి ఆ వ్యాపారికి రెగ్యులర్ కస్టమర్.అలా వచ్చే క్రమంలో.వ్యాపారి వద్ద భారీ మొత్తంలో నగదు ఉండటం గమనించేవాడు.
అంతేకాదు ప్రతిరోజు ఇంటికి తిరిగెళ్లే సమయంలో వ్యాపారి బ్యాగ్ నిండుగా ఉండేది.దాంతో ఆ బ్యాగ్ నిండా డబ్బులే అని,ఆ బ్యాగ్ కొట్టేస్తే సెటిల్ అయిపోవచ్చనే దురాలోచన పుట్టింది.
అంతే ఆలోచన వచ్చిందే తడవుగా నలుగురు ఫ్రెండ్స్ తో చోరికి ప్లాన్ వేశాడు.

ఒకరోజు రాత్రి వ్యాపారి తన బ్యాగ్‌తో ఇంటి వెళ్తుండగా కాపు కాసి అడ్డగించారు.ఆయన కళ్లల్లో కారం కొట్టి బ్యాగ్ లాక్కుని, వ్యాపారిని పక్కకు తోసేసి ఆయన స్కూటర్‌ను కూడా లాక్కున్నారు.ఇంటికెళ్లాక ఆశగా బ్యాగ్ తెరిచారు.
అంతే బ్యాగ్లో ఉన్నది చూసి అందరూ షాక్ తిన్నారు.ఇంతకీ ఆ బ్యాగ్లో వారికెంత క్యాష్ దొరికిందంటే, బ్యాగ్ మొత్తం వెతికగా కేవలం రూ.5 కాయిన్ మాత్రమే ఉంది.బ్యాగులో ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని దాన్ని తిరిగి ఇచ్చేయమని వ్యాపారి ఎంతగా ప్రాధేయపడ్డా ఆ చోరీగాళ్లు వినిపించుకోలేదు.
కనీసం స్కూటరు ఢిక్కీలో భారీగా డబ్బుకట్టలు ఉంటాయేమో అనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి.
ఆ రాత్రి వ్యాపారి పోలిస్ కంప్లైంట్ ఇవ్వడంతో సిసి కెమెరాల సహకారంతో వారిని పట్టుకున్నారు పోలీసులు.
బ్యాగ్‌లో తాను ఎప్పుడూ పెద్దగా నగదు తీసుకెళ్లనని లంచ్ బాక్స్, నగదు లావాదేవీలకు సంబంధించిన కాగితాలు ఉండటం వల్ల బ్యాగ్ నిండుగా కనిపించి ఉంటుందని పోలీసులతో చెప్పాడా వ్యాపారి.దొంగతనం జరిగే టైంలో వ్యాపారి జేబులో 10,000 రూపాయలు ఉన్నాయట.
పాపం దొంగలు కనీసం అవి తీసుకెళ్లినా భోజనం ఖర్చు దక్కేది.ఇఫ్పుడు చిప్పకూడు తప్ప ఏం మిగలలేదు.