వైకాపా అధినేత వైఎస్.జగన్ ఇటీవల కొద్ది రోజులుగా ఎక్కడా లేని ఉత్సాహంతో కనిపిస్తున్నానరు.
ఏపీలో గత ఏడెనిమిది నెలలుగా వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసపెట్టి సైకిల్ ఎక్కేశారు.తన పార్టీకి చెందిన కీలక నేతలు సైతం సైకిల్ గూటికి చేరిపోవడంతో డీలా పడ్డ జగన్ ఇప్పుడు ఆపరేషన్ రికవరీ పేరుతో కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేశాడు.
ఈ కొత్త ఆపరేషన్‌లో ఫలితాలు చాలా వరకు సక్సెస్ అవుతుండడంతో జగన్‌లో ఎక్కడా లేని జోష్ కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
ఏపీలో కీలకమైన బెజవాడలో కీలక నాయకులపై వలవేసిన జగన్ ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇప్పటికే వైకాపాలో చేరారు.అదే నగరం నుంచి మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, మల్లాది విష్ణుతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ సైతం వైకాపాలో చేరతారని వార్తలు వస్తున్నాయి.
ఇక టీడీపీకే చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం వచ్చే ఎన్నికల నాటికి ఎప్పుడైనా జగన్ గూటికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.జగన్ బెజవాడ ఆపరేషన్ చాలా వరకు హిట్ అయినట్టే కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ కాపు ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన తూర్పుగోదావరిలో స్టార్ట్ చేసిన ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది.
తూర్పులో కీలకమైన రాజమండ్రి నగరంలో పట్టున్న కీలక నేత, కాపు వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు వైకాపాలో చేరారు.
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ వైకాపా కండువా కప్పుకున్నారు.జిల్లాలోని కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టున్న నాయకునిగా ఆయనకు గుర్తింపు ఉంది.
దుర్గేష్‌కు రాజమండ్రి, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోకవర్గాల్లో మంచి పట్టుంది.దుర్గేష్ వైకాపా ఎంట్రీ వైకాపాకు చాలా ప్లస్ కానుంది.
2019 ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటినుంచే చాపకింద నీరులా స్కెచ్‌లు వేస్తూ సక్సెస్ అవుతోన్న జగన్ ఆపరేషన్ రికవరీ పేరుతో చేసిన కొత్త ఆపరేషన్‌లో మంచి ఫలితాలే రాబడుతున్నారు.మరి జగన్ దూకుడు ఫ్యూచర్‌లో ఇంకెంత స్పీడ్‌గా ఉంటుందో చూడాలి.







