తమిళ తంబీలు ఆనవాయతీని కొనసాగిస్తూ, అధికారాన్ని జయలలిత చేతి నుంచి లాగేసుకుని కరుణానిధికి అప్పగిస్తారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్న వేళ, చెన్నయ్, పోయిస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలో నిశ్శబ్దం తాండవిస్తోంది.రెండు రోజుల క్రితం ఓటేసిన తరువాత ఇంటికి వెళ్లిన ఆమె ఆపై బయటకు రాలేదు.
పోలింగ్ సరళిని విశ్లేషించిన తరువాత పార్టీ నేతలు ఆమెతో పరాజయం వార్తలను పంచుకోలేకపోయారని తెలుస్తోంది.కొందరు జిల్లా పార్టీ కార్యదర్శులు మాత్రం ఆమె ఇంటికి చేరుకుని తమ నివేదికలు ఇచ్చినట్టు సమాచారం.
ఆపై జయలలిత ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా మౌనంగా ఇంటిలోనే ఉండిపోయారు.అన్నాడీఎంకే మంత్రులు సైతం ఆమె నివాసానికి వెళ్లి పలకరించే ధైర్యం చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది.
జయ వెంట ఆమె స్నేహితురాలు శశికళ ఉన్నారు.కాగా, ఈ రెండు రోజుల నుంచి మీడియాలో వస్తున్న అన్ని వార్తలనూ ఆమె చూస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఎగ్జిట్ పోల్స్ లో ఒక్కదానిలో తప్ప మిగతా అన్నింటా జయకు పరాభవమేనని, తమిళులు డీఎంకే పట్ల కరుణ చూపారని వెల్లడైన సంగతి తెలిసిందే.







