వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.
మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.
ఇక గల్ఫ్ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.
గ్రామాలను దత్తత తీసుకోవడం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, విద్య, ఉపాధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
తాజాగా పంజాబ్‌కు చెందిన ముగ్గురు ఎన్ఆర్ఐలు స్వగ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో స్మార్ట్ ప్రైమరీ స్కూల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చారు.అమెరికాలో స్థిరపడిన హర్మెల్ సింగ్ షా, గురు కరణ్ సింగ్ షా, కెనడాకు చెందిన నవతేజ్ సింగ్ షాలు అథౌలా గ్రామంలో రూ.50 లక్షలకు పైగా వ్యయంతో ప్రైమరీ స్కూల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చారు.గ్రామంలో రూ.50 లక్షలతో ఒక స్మార్ట్ ప్రైమరీ స్కూల్‌ను నిర్మించడానికి సహకారం అందించాలని అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ కోరినట్లు చండీగఢ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ ఆదివారం జలంధర్ జిల్లాలోని అథౌలా గ్రామానికి వచ్చారు.
ఈ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కుల్‌దీప్ ప్రసంగిస్తూ గ్రామాల్లో పనులు వేగంగా జరిగేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తక్షణమే అందజేస్తామని ప్రకటించారు.ఒకట్రెండు రోజుల్లో స్మార్ట్ ప్రైమరీ స్కూల్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఎన్‌వోసీలు జారీ చేయాలని అటవీ, విద్యా శాఖ అధికారులను ధాలివాల్ ఆదేశించారు.

అమెరికాలో స్థిరపడిన అథౌలా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు శనివారం తనను కలిశారని.రూ.50 లక్షలతో ‘‘విలేజ్ స్మార్ట్ ప్రైమరీ స్కూల్’’ నిర్మాణానికి తమ ప్రణాళిక గురించి తెలియజేసినట్లు ధాలివాల్ వెల్లడించారు.స్వగ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర ఎన్ఆర్ఐలను ప్రోత్సహించడానికి తాను అథౌలాకు వచ్చినట్లు కుల్‌దీప్ సింగ్ తెలిపారు.
గ్రామీణ పంజాబ్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరివర్తన కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని ఆయన స్పష్టం చేశారు.