అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
దీనికి సంబంధించి యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) సంచలన విషయాలను బయటపెట్టింది.ఈ నివేదికలో అమెరికాలోకి అక్రమంగా వస్తున్న వారి గురించి తెలియజేసింది.
తాజాగా కాలిఫోర్నియా సరిహద్దు పోస్ట్ వద్ద అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు కంచె ఎక్కుతుండగా వంద మంది అక్రమ వలసదారులను యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు పట్టుకున్నారు.వీరిలో 17 మంది భారతీయ పౌరులు కూడా వున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంపీరియల్ బీచ్ స్టేషన్‌కు చెందిన శాన్ డియాగో సెక్టార్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన 100 మంది అక్రమ వలసదారులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
బోర్డర్ ఫీల్డ్ స్టేట్ పార్క్‌కు తూర్పున అర మైలు దూరంలో వున్న కంచెపైకి ఎక్కుతుండగా వలసదారుల సమూహాన్ని ఏజెంట్లు ఎదుర్కొన్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది.
ఈ బృందంలో ఎక్కువగా స్పానిష్ మాట్లాడే వలసదారులు వున్నారని అధికారులు పేర్కొన్నారు.వీరిందరినీ దగ్గరలోని స్టేషన్‌కు తరలించిన అధికారులు.
వైద్య చికిత్స అందించారు.ఈ వంద మంది అక్రమ వలసదారులలో సోమాలియా (37), భారతదేశం (17), ఆఫ్ఘనిస్తాన్ (6), పాకిస్తాన్ (4) సహా 12 దేశాల పౌరులు వున్నట్లు అధికారులు తెలిపారు.