అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడి రెండు చేతులా సంపాదించాలన్నది ఏంతో మంది కల.ఇందుకోసం చట్టప్రకారంగా వెళ్లేవారు కొందరైతే.
అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలో అడుగుపెట్టేవారు ఇంకొందరు.అయితే ఇలా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారిపై ఇటీవలి కాలంలో హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు నిఘా వుంచారు.
ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన 150 మంది భారతీయులను ఆ దేశం బుధవారం వెనక్కి పంపించింది.వీరంతా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
వీరిలో భారతీయులతో పాటు బంగ్లాదేశీయులు, శ్రీలంక దేశస్తులు కూడా ఉన్నారు.
వీరు గత కొన్నేళ్లుగా అక్రమ మార్గంలో వీసా ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాలో అడుగుపెడుతున్నట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్ సర్వీస్ దర్యాప్తులో తేలింది.ఇందుకు గాను వారు దళారులకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చెల్లిస్తున్నారు.డబ్బు ముట్టిన తర్వాత వీరిని మధ్యవర్తులు నకిలీ ధ్రువపత్రాలతో పారిస్, మాస్కో మీదుగా మెక్సికో పంపుతారు.
అనంతరం రోడ్డు మార్గంలో ఆరిజోనా మీదుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి తరలిస్తారు.

అయితే అమెరికా భారతీయులను ఇలా వెనక్కి పంపడం ఇదే మొదటిసారి కాదు.గతంలోనూ అమెరికా ఇలాగే 117 మంది భారతీయుల్ని వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.ఇక అక్రమ వలసదారుల అంతు చూసేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలకలం రేపింది.
అమెరికాలో అక్రమంగా నివసించేందుకు పలువురు భారతీయులు దళారులను ఆశ్రయించారు.వీరంతా భారతీయ విద్యార్ధులను ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేర్చి అధికారులకు దొరికిపోయారు.ఈ వ్యవహారంలో దళారులుగా వ్యవహరించి కీలకపాత్ర పోషించింది తెలుగువారే కావడం గమనార్హం.వీరిలో ఆరుగురికి గతవారం అక్కడి న్యాయస్థానం జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.