ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఉదారత చాటారు. జొమాటో పబ్లిక్ లిస్టింగ్ లోకి వెళ్లడం కంటే ముందు దీపిందర్ గోయల్ పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన కొన్ని ఈఎస్ఓపీ (ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్) లను ఇచ్చాయి.
వీటిల్లో కొన్నింటి గడువు తీరిపోవడంతో ఆ షేర్లను గోయల్ విక్రయించనున్నారు.గత నెల ఉన్న సగటు షేరు ధర ప్రకారం ఈ ఈఎస్ఓపీల విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.700 కోట్లు (90 మిలియన్ డాలర్లు) ఉంటుంది.అయితే ఈ షేర్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని తమ సంస్థ డెలివరీ పార్టనర్స్ పిల్లల చదువులకు సాయం చేసేందుకు ఆయన ముందుకొచ్చారు.
జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు ఈ మేరకు ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక(ఈఎస్‌వోపీ)లను కేటాయించారు.అంతర్గత సమాచారం ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు తెలిపారు.
జొమాటోలో ఐదేండ్లకుపైగా సేవలు అందిస్తున్న డెలివరీ పార్టనర్ల పిల్లలు ఇద్దరికి.ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.50,000 చొప్పున సాయం అందిస్తారు.కంపెనీలో 10 ఏండ్లు సర్వీస్ పూర్తిచేసుకున్న పార్టనర్ల పిల్లలకు ఈ సహాయం రూ.1 లక్ష వరకూ ఉంటుందని గోయల్ వివరించారు.ఆడపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటిస్తామన్నారు.
బాలికలకు 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పరీక్షలు పూర్తయిన తర్వాత వారికి బహుమతిగా కొంత సొమ్ము అందించడం జరుగుతుందన్నారు.పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తే మరిన్ని రివార్డులు కూడా ఉంటాయి అని ఆయన తెలిపారు.

జొమాటో 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రకటన రావడం హర్షనీయం అని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కంపెనీ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో కూడా భారీగా పెట్టుబడి పెట్టింది.భారతదేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం పెరుగుతున్నందున, కంపెనీలు అట్రిషన్ రేట్లను నియంత్రించడానికి ఉద్యోగులను కొనసాగించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి.కాగా, గోయల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.







