సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలోనూ, బయట వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించేలా, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి చేసే వారు మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు.వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు, విమర్శలు చేసే విషయంలోనూ, చంద్రబాబు కంటే ఎక్కువ అచ్చెన్న స్పందిస్తూ, ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉండేవారు.
దీంతో అచ్చెన్న అడ్డు తొలగించుకునేందుకు, ఆయనపై ఉన్న ఈ ఎస్ ఐ కుంభకోణం కేసు దర్యాప్తును వేగవంతం చేయించి ఆయనను అరెస్టు చేయించింది.దీంతో టీడీపీ లో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగిపోయింది.
దీంతో ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.దూకుడుగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయగలగడమే కాకుండా , ఆయన బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడం తో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి దక్కింది.
దీంతో వైసీపీలోనూ కాస్త కంగారు కనిపిస్తోంది.
సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన్ను కంట్రోల్ చేయలేకపోయామని, ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అనే హోదా కూడా ఉండడంతో ఆయన మరింతగా రెచ్చిపోతారు అని అభిప్రాయ పడుతున్నారు వైసీపీ పెద్దలు.
అందుకే అచ్చెన్న సొంత నియోజకవర్గం టెక్కలి లోనే కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు.సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మాటే చెల్లుబాటు అవుతుంది.
ఆ విధంగానే టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వైసిపి నియోజక వర్గ ఇంచార్జులే పెత్తనం చేస్తున్నారు.తామే ఎమ్మెల్యే అన్నట్లుగా వారి వ్యవహారం నడుస్తోంది.ఇది ఇలా ఉంటే, అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి లో అధికారులు ఎవరూ ఆయన ఆదేశాలను పాటించవద్దని, ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశాలకు ఎవరు హాజరు కావద్దని అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అక్కడి వ్యవహారాలు అన్నిటిని టెక్కలి వైసీపీ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.
ఆయనే ఎమ్మెల్యే అన్నంత రేంజ్ లో నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు.ఆయనే కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి కీలక నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఉన్న పోస్టులను కట్ట పెట్టారు.
ఇప్పటి వరకు టెక్కలి నియోజకవర్గం కు ముగ్గురు ఇంచార్జులు ఉండేవారు.వారిలో పేరాడ తిలక్ కు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వగా, కిల్లి కృపారాణి కి మరో కీలక పదవి కట్టబెట్టబోతున్నారు.
ఈ విధంగా , రాజకీయంగా దెబ్బతీసేందుకు, ఆయన మాట సొంత నియోజకవర్గంలో చెల్లుబాటు కాకుండా చేసేందుకే ఈ విధంగా ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.