ఏపీలో వచ్చే ఎన్నికలు… టిక్కెట్ల నేపథ్యంలో కప్పుల తక్కెడలు స్టార్ట్ అయ్యాయి.ఎన్నికలు యేడాది ఉండగానే అప్పుడే పొలిటికల్ హీట్ ఇక్కడ మామూలుగా లేదు.
అధికారపక్షంలో ఉన్న వారు టిక్కెట్లు వస్తాయన్న ధీమా లేకపోవడంతో కొందరు ఇప్పుడు టిక్కెట్ కోసం విపక్ష వైసీపీని నమ్ముకుని ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారు.మరి అధికార పార్టీ వాళ్లు విపక్షంలోకి వస్తే ఇప్పటి వరకు అక్కడ పార్టీని నమ్ముకుని టిక్కెట్ రేసులో ఉన్న వారి పరిస్థితి ఏంటి ? మరి ముసలం మొదలవుతుంది కదా.ఇప్పుడు విజయవాడ వైసీపీలో అదే జరుగుతోంది.

విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ ఎంట్రీ ఇప్పుడు అక్కడ వైసీపీలో ముసలం రేపుతోంది.ఇప్పటికే అక్కడ వైసీపీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి.మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణుకు, వంగవీటి రాధాకు పడడం లేదు.
ఇప్పటికే వీరిద్దరి మధ్య సెంట్రల్ సీటు విషయంలో వార్ జరుగుతోంది.మల్లాది పార్టీలోకి రావడంతో గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంగవీటి రాధాను సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించారు.
సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇప్పుడు వంగవీటి రాధా, విష్ణులలో ఎవరికి ఇస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇక ఇప్పుడు తూర్పు సీటు విషయంలోనూ అదే వార్‌కు తెరలేచింది.
గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేటర్ బొప్పన భావకుమార్ వైసీపీ బాధ్యతలు చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో తూర్పు సీటు వస్తుందన్న ఆశతో ఆయన ఇక్కడ పార్టీ కార్యకలాపాలు చూస్తున్నారు.
అలాగే ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు వీవీ.చౌదరి కూడా రేసులో ఉన్నారు.
ఇప్పుడు యలమంచిలి రవి పార్టీలో చేరేందుకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు తూర్పు సీటు ఆయనకే ఇస్తానని హామీ ఇచ్చినట్టు వస్తోన్న వార్తలతో భావకుమార్, చౌదరి రగిలిపోతున్నారు.
యలమంచిలి వైసీపీ ఎంట్రీ విజయవాడలో ఆ పార్టీకి ఎంత ప్లస్ అవుతుందో తెలియదు గాని… ఇప్పటికే ఉన్న గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోసేదిగా ఉంది.
వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్ సీటు ఆశిస్తున్నారు.అయితే జగన్ అక్కడ మైనార్టీ క్యాండెట్‌ను పోటీ చేయించాలని చూస్తున్నారు.సెంట్రల్‌లో గొడవలు సరేసరి.ఇక ఇప్పుడు తూర్పులోనూ అదే పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
వెస్ట్‌లో వెల్లంపల్లి వెనక్కి తగ్గే ప్రశక్తే లేదంటున్నారు.సెంట్రల్‌లో మల్లాది వర్సెస్ రాధా పోరు కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉంది.
ఇక ఇప్పుడు తూర్పులో ఇప్పటికే భావకుమార్ వర్సెస్ వివి.చౌదరి వార్ కాస్తా యలమంచిలి ఎంట్రీతో మూడు ముక్కలాటగా మారింది.రవి టిక్కెట్టుపై హామీతోనే చేరారంటున్నారు.మరి మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటో ? అర్థం కావట్లేదు.ఏదేమైనా విజయవాడ వైసీపీ గ్రూపు తగాదాలు జగన్‌కు కత్తిమీద సాములా మారాయి.







