జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యక్తిగత విమర్శలు చేసి రోజులు గడుస్తున్నా… ఆ వేడి ఇంకా తగ్గలేదు.వైసీపీ పై జనసేన అభిమానులు రగిలిపోతుండగా.
ఇప్పుడు పవన్ సామజిక వర్గం వారు కూడా గుర్రుగా ఉన్నారు.ఇది ఖచ్చితంగా వైసీపీ కి చేటు తీసుకురావడం ఖాయం అనే సంకేతాలు ఇప్పటికే జగన్ కు అందడంతో ఆయన డైలమాలో పడ్డారు.
అందుకే తక్షణమే నష్ట నివారణ చర్యలకు దిగాలని తన పాద యాత్ర షెడ్యూల్ ని కూడా అకస్మాత్తుగా మార్చేసుకున్నాడు.ప్రస్తుతం జగన్ కాపుల కంచుకోట అయిన తూర్పుగోదావరిలోనే తన పాదయాత్ర చేస్తుండడం గమనార్హం.

జగన్ వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీలోని కొందరు కాపు నేతలు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.మీరు చేసిన కామెంట్స్ సరైనవే అయినా, స్థానికంగా కాపు సామాజికవర్గం నాయకులమైన మాకు, పవన్ అభిమానులు, కాపు ఓటర్ల నుంచి కొంత ఇబ్బందులు తప్పవు.ఎటూ కాపులు అధికంగా ఉన్న తూగో జిల్లాలోనే ఉన్నారు, కనుక కాస్తా దిద్దుబాటు చర్యలు చేసుకుందాం.కాపుల రిజర్వేషన్లపై హామీ ఇచ్చి, వారిని బుజ్జగించే పని చేద్దాం.
అని చెప్పుకోవడంతో జగన్ కూడా అంగీకరించారు.అందుకే ఆయన పాదయాత్ర షెడ్యూల్ ముందు నిర్ణయించినట్లు కాకుండా అకస్మాత్తుగా మారింది.

పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం తర్వాత పిఠాపురం వెళ్లాల్సి ఉంది.కానీ షెడ్యూల్ మార్చి రూట్ మ్యాప్ లో లేని జగ్గంపేటకు శనివారం వెళ్లేలా నిర్ణయించారు.ఆ నియోజకవర్గంలో జగన్ మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేశారు.కాపులు అధికంగా ఉండే జగ్గంపేట నియోజకవర్గంలో ఇదే ఊపులో, ఇదే వేడిలో పర్యటించి వారిని చల్లార్చాలనే ప్రయత్నాలు ప్రారంభించారు.
కాపుల రిజర్వేషన్లపై కూడా గతంలో జగ్గంపేట కేంద్రంగా పెద్ద ఉద్యమమే నడిచింది.దీంతో ఇదే సమయంలో కాపులను మంచి చేసుకుని, వారి రిజర్వేషన్లపై బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.