సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఏ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఏ నాయకుడిని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు.? అనే విషయాలను ముందుగా తెలుసుకొని తమ లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకులు సర్వేలకు దిగుతున్నారు.అనేక ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల ఆలోచనా విధానం ఏవిధంగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి.అనే విషయాలపై జనాల నాడి తెలుసుకునేందుకు సర్వేల పేరుతో రంగంలోకి దిగిపోయాయి.

సర్వేల కోసం ముందుగా జనాల నుంచి సరైన సమాచారం తెలుసుకునేందుకు ముందుగానే కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకున్నాయి.వీటి ఆధారంగానే పార్టీల భవిష్యత్తును మార్చుకోవచ్చని పార్టీల అధినాయకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రజలపై సంధిస్తున్న ప్రధాన ప్రశ్న.మీ ఓటు ఎవరికి? ఎందుకు? ఈ రెండు ప్రశ్నలకు ప్రజల నుంచి రాబడుతున్న సమాధానాలే కీలకంగా మారనున్నాయి.అయితే, వాస్తవానికి ఎవరికి ఓటు వేస్తారు.? అనేది ప్రజాస్వామ్యంలో గోప్యత హక్కు కిందకే వస్తుంది.దానిని తెలుసుకోవాలని అనుకోవడం తప్పు! అయితే, సర్వే కాబట్టి చెప్పినా ఓకే చెప్పకపోయినా ఓకే.అన్న విధంగా సర్వేలు మొదలుపెట్టారు.

సర్వేల్లో అడుగుతున్న ప్రశ్నలు ఇవే !
మీరు ఏ న్యూస్ చానెల్స్ ఎక్కువగా చూస్తారు? మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఎవరు సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు? ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అవినీతి తగ్గిందా, పెరిగిందా? గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? నదుల అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై అభిప్రాయం ? సీఎం పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్ష నేత జగన్ పనితీరుపై మీ అభిప్రాయం ? ప్రత్యేక హోదా కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారు? ప్రతిపక్షాల్లో ఏ పార్టీ బలమైన పాత్ర పోషిస్తోంది ? వైసీపీ ప్రకటించిన హామీలు అమలు సాధ్యమేనా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తున్న హామీలు ఆచరణ సాధ్యమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు ? మీ ఎమ్మెల్యే మీ ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరిస్తున్నారా? మీ ఎమ్మెల్యే అందరినీ కలుపుకుపోతున్నారా ? మీ ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తి చెందారా?
.






