ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్న విమర్శల గురించి తెలిసిందే కదా.ఇప్పుడు సాక్షాత్తూ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.
అధికారంలోకి రావడానికి జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది మద్య నిషేధం.అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం జగన్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
మద్యం షాపులు, బార్ల లైసెన్స్ గడువు పూర్తి కాకముందే వాటిని రద్దు చేసి కొత్త వాటికి టెండర్లు పిలుస్తున్నారు.అదేమంటే.క్రమంగా మద్య నిషేధంలో భాగంగానే ఇలా చేస్తున్నామని బదులిస్తున్నారు.తాజాగా కొత్త బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి.ప్రభుత్వానికి చురకలంటించారు.కేవలం లైసెన్స్ దరఖాస్తు కోసమే రూ.10 లక్షలు వసూలు చేస్తుండటంపై మండిపడ్డారు.దరఖాస్తు కోసమే ఇంత చెల్లించిన తర్వాత వారికి లైసెన్స్ రాకపోతే నష్టమే కదా.దీనివల్ల ప్రభుత్వానికే లాభం.అయినా బార్లను తగ్గిస్తామంటూ కొత్తగా ఎందుకు లైసెన్సులు జారీ చేస్తున్నారు అని ప్రశ్నించారు.
భారీ మొత్తంలో వసూలు చేయడం వల్ల దరఖాస్తులు తక్కువ సంఖ్యలో వస్తాయి.అయినా సామాన్యుల బాగు కోసం మద్య నిషేధంలో భాగంగానే ఈ కొత్త బార్ల లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఏజీ చెప్పగా.ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
సామాన్యుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటే.రీటెయిల్ షాపులను ఎందుకు తగ్గించడం లేదు? పైగా బార్లను తొలగిస్తామంటూ పాతవి రద్దు చేసి కొత్తవి ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అని ప్రశ్నించారు.
కొత్త బార్ల కోసం ప్రభుత్వం తీయాలనుకున్న డ్రా ప్రక్రియను 23వ తేదీ వరకూ చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది.మరోవైపు కొత్త బార్ల లైసెన్సులపై కోర్టులో కేసు నడుస్తుండటం, కేవలం దరఖాస్తుకే పది లక్షలు వసూలు చేస్తుండటంతో వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
నవంబర్ 29నే దరఖాస్తుల కోసం ఆహ్వానించగా.ఇప్పటి వరకూ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం.