తిరుమల వెంకన్న ఆస్తుల అమ్మకంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హిందుత్వ సంస్థలతో పాటు, ప్రతిపక్షాలు అధికార పార్టీని ఈ వ్యవహారంలో ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
నవరత్నాల కోసం ప్రభుత్వమే వెనకుండి టీటీడీ ఆస్తులని అమ్మిస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇదే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
దేవుడి మాన్యంని ఇలా ఇష్టానుసారంగా ఎలా అమ్మేస్తారు అంటూ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.జాతీయ చానల్స్ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ వ్యవహారంపై ధ్వజం ఎత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయకుండా, మళ్లీ అవే తప్పులు చేయాలని టీటీడీ భావిస్తోందని విమర్శించారు.దేవుడి పేరిట ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా ఆ దేవుడికి టీటీడీ ద్రోహం చేస్తోందని అన్నారు.
టీటీడీ తన నిర్ణయం ద్వారా భూములు విరాళంగా ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.దాతలు ఎంతో భక్తితో ఆస్తులు సమర్పిస్తారని, ఆ ఆస్తులను పరిరక్షించాలే కానీ, విక్రయించడం సబబు కాదని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.
అయితే ఈ విషయం మరింత పెద్దది కాదంతో టీటీడీ కూడా వ్యూహాత్మకంగా ఆస్తుల విక్రయంపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది.