ఇకపై రాష్ట్రంలో ఏ ప్రభుత్వ భవనానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయమని ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణ పత్రం సమర్పించింది.ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఇతర వాహనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై రాష్ట్రంలో అధికార వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ చర్యలు సవాల్ చేస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఇక తాజాగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు మోటార్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలి ఉన్న రంగులు వేయడంపై జరిగిన విచారణ సందర్భంగా వెంటనే రంగులు తొలగించడంతో పాటు ప్రమాణ పత్రం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేసింది.
అంతేకాదు ప్రభుత్వం కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఇతర వాహనాలకు భవిష్యత్తులో అధికార పార్టీ రంగులు వేయబోమని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు.
ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఏపీని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వాటికి వైసీపీ రంగులు వేశారు దీనిపై జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరశా సురేష్ కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది జెడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.రంగులును తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయబోమని ప్రమాణపత్రం దాఖలు చేసింది.గతంలో గ్రామ సచివాలయాలకు, వాటర్ ట్యాంకు చివరికి స్మశానాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.గతేడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ఆర్ పార్టీ జెండాలను తొలగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే.దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూపై కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
ప్రమాణపత్రం లో అంశాలు క్షేత్రస్థాయిలో వాస్తవికతను పరిగణలోకి తీసుకుని నవంబర్ 5వ తేదీన తదుపరి విచారణ జరుపుతామని ధర్మశాసనం స్పష్టం చేసింది.