వైసీపీ ఆధ్వర్యంలో పలు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు వైసీపీ నేతలను చిక్కుల్లో పడేస్తున్నాయి.ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వాస్తవానికి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు ప్రజల్లో మంచి పేరు వచ్చింది. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత వాలంటీర్ల ద్వారా చాలా పనులు ప్రజలకు వేగంగా అందుతున్నాయి.
గతంలో ఫించన్ అందుకోవాలంటే గతంలో పంచాయతీ కార్యాలయాల ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఒకటో తేదీ వేకువజామునే వాలంటీర్లు స్వయంగా ఇంటికి వచ్చి ఫించన్ అందిస్తున్నారు.
అంతేకాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు పొందడంలో ప్రభుత్వానికి, ప్రజలకు వాలంటీర్లు వారధిలా పనిచేస్తు్న్నారు.అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం తగ్గిపోయిన మాట మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే.
దీంతో ఎమ్మెల్యేలు తమ ఫస్ట్రేషన్‌ను వాలంటీర్ల మీద చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు.వాలంటీర్లను మనమే పెట్టామని.మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు.వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌లోకి తీసుకుని నడిపించాలి.మిమ్మల్ని ఎవరూ వద్దని చెప్పరు అని కూడా మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

అంతకు ముందు మంత్రి అంబటి రాంబాబు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులు అని వ్యాఖ్యానించారు.పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనే తీసేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.అవసరమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామన్నారు.ఇలా రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.మరి సీఎం జగన్ స్పందించి దీనికి బ్రేక్ వేస్తారో లేదో వేచి చూడాలి.