కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka Telangana assembly elections ) తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది .ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు మిగతా రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఏపీ, తెలంగాణ విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బాగా బలహీనపడింది.తెలంగాణలో వేగంగానే కోలుకుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.కానీ ఏపీలో పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే అన్నట్టుగానే ఉంది.
దీంతో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ( AP Congress )కు రిపేర్లు చేసే పనికి శ్రీకారం చుట్టారు ఆ పార్టీ ఆగ్రనేతలు.ఈ మేరకు వై నాట్ ఏపీ అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
ఇక ఎన్నికల వరకు పూర్తిగా ఏపీపై దృష్టి సారించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.విజయవాడలో కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించబోయే మేనిఫెస్టో అంశం పైన చర్చ జరిగింది.ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామనే హామీతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
![Telugu Ap Congress, Congress, Rahul Gandhi, Telangana-Politics Telugu Ap Congress, Congress, Rahul Gandhi, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Whynot-AP-Congress-woke-up-earlyc.jpg)
ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు .తెలంగాణలో ఈ నినాదం వర్కౌట్ కావడంతో ఏపీలోనూ ఇదే నినాదంతో జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు ( Gidugu Ruddaraju )అధ్యక్షతన విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో పార్టీ సీనియర్లు రఘువీరారెడ్డి , జెడి శీలం, పల్లంరాజు తదితరులు హాజరయ్యారు.అనేక కీలక అంశాల పైన చర్చించారు .ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే విధంగా ఏం చేయాలి అనే దాని పైన చర్చించారు.కర్ణాటక , తెలంగాణలో గెలిచినట్టే ఏపీలోనూ గెలవాలి అని, అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని నిర్ణయించారు.కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ,తెలంగాణలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, ఏపీలో గెలిచేందుకు ఏడు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
![Telugu Ap Congress, Congress, Rahul Gandhi, Telangana-Politics Telugu Ap Congress, Congress, Rahul Gandhi, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Whynot-AP-Congress-woke-up-earlyb.jpg)
ఏపీకి ప్రత్యేక హోదా ను ప్రధాన అజెండగా చేసుకునే జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.ఇక కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ( Rahul Gandhi , Priyanka Gandhi )ఏపీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం , అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉంది .ఇంత తక్కువ సమయంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం చేసి ఎన్నికల్లో గట్టెక్కడం అంటే ఆషామాషీ కాదు. ఇప్పటికే పార్టీ క్యాడర్ చెల్లా చెదురు అయ్యింది.
మెజార్టీ కాంగ్రెస్ నేతలు వైసిపి, టిడిపిలలో ఎప్పుడో చేరిపోయారు.పేరుకు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, పెద్దగా కార్యకలాపాలు ఏమి చోటు చేసుకోవడం లేదు.
ఈ ఐదేళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం ఎన్నికలకు మూడు నెలలు ముందుగా హడావుడి చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.